పోరాటానికి రెడీ. మేము ఎపుడూ సిద్ధమే అంటున్నారు విశ్రాంత ఉద్యోగులు. మేము రిటైర్ అయ్యామనుకుంటే పొరపాటు, అదే సత్తువ, అదే ఉత్సహం, చురుకుదనం మాలో ఉంది అని అంటున్నారు. కొత్త పీయార్సీ పేరిట మాకు తీరని అన్యాయం జరిగింది అంటున్నారు పెన్షనర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రామ్మూర్తినాయుడు. ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేయడానికి ఇక తాము కూడా ఉద్యోగులతో చేతులు కలిపి పోరాట బాట పడతామని అంటున్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన సంఘ సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరు మీద ఘాటు వ్యాఖ్యలే చేశారు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు అన్యాయం చేయడం దారుణమని, ఈ ప్రభుత్వానికి పెద్దల పట్ల ఉన్న గౌరవం మర్యాద అంటే ఇదేనా అని రౌతు ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం రద్దు చేసుకుంటూ పోవడమేంటని ఆయన నిలదీస్తున్నారు. ఇలా ఏదో ఒక సమస్య మీద ఉద్యోగులు రోడ్డు మీద ఉంటే పాలన ఏలా సాఫీగా సాగుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు అని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.
వైసీపీ పెద్దలు ఎంతో మేలు చేస్తారనుకుంటే 11వ పీయార్సీ పేరిట ప్రభుత్వం అతి పెద్ద అన్యాయం చేసిందని, పెన్షనర్లను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆయన అంటున్నారు. తాము ఇక మీదట ప్రత్యక్ష పోరాటం చేస్తామని, తమ వయసుని సైతం పక్కన పెట్టి న్యాయం జరిగేటంతవరకూ ఉద్యమ క్షేత్రంలో ఉంటామని స్పష్టం చేశారు. మొత్తానికి తమ దేహానికి విశ్రాంతి లేదని పెన్షనర్లు చాటి చెబుతామని అంటున్నారు. మరి ఈ అందోళన ఇంకా గట్టిగా సాగే అవకాశాలు ఉన్నాయని వృద్ద నేతలు చెబుతున్నారు.