గన్ కల్చర్ అక్కడ కూడానా… ?

గన్ కల్చర్ అంటే అభివృద్ధి చెందిన దేశాల వైపే అంతా చూస్తారు. వారినే విమర్శిస్తారు. ఇక గన్ కల్చర్ పెరిగిన చోట క్రిమినల్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. దేశంలో చూస్తే కొన్ని…

గన్ కల్చర్ అంటే అభివృద్ధి చెందిన దేశాల వైపే అంతా చూస్తారు. వారినే విమర్శిస్తారు. ఇక గన్ కల్చర్ పెరిగిన చోట క్రిమినల్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. దేశంలో చూస్తే కొన్ని నగరాల్లో ఇది నెమ్మదిగా విస్తరిస్తోంది. అలాంటి గన్ కల్చర్ ఇపుడు అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో సౌడ్ చేయడంతోనే అంతా ఉలిక్కిపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఒక రాత్రి సర్పంచ్ మీద పేలిన తూటాతో శ్రీకాకుళం షాక్  కి గురి అయింది అంటున్నారు.

శ్రీ‌కాకుళం న‌గ‌రం, మ‌ధురా న‌గ‌ర్ కాల‌నీలో మంగ‌ళ‌వారం రాత్రి రామ‌చంద్రాపురం స‌ర్పంచ్ గొలివి వెంక‌ట ర‌మ‌ణ‌పై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌తో పోలీసులు కూడా అప్రమ‌త్తమయ్యారు. ఈ ఘటనలో సర్పంచ్ తృటిలో తప్పించుకున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీ లాగుతున్నారు.

అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తగాదాలు, ఇసుక అమ్మకాల్లో వాటాలు, ర్యాంపుల్లో తేలని డబ్బుల గొడవలు అన్నీ కలసే ఈ హత్య చేసే దాకా సీన్ వచ్చిందని అంటున్నారు. ఆర్ధిక లావాదేవీల వల్లనే ఈ హత్యకు పూనుకున్నారని కూడా చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే హత్యకు పధకం పన్నడం, తుపాకీతో పేల్చాలనుకోవడం వంటివి వెనకబడిన శ్రీకాకుళం జిల్లా ఎరగని విషయాలే. మరి ఈ గన్ కల్చర్ ఇక్కడికి  ఎలా వచ్చింది అన్నదే పోలీసులకు అంతు పట్టడంలేదు. మరో వైపు చూస్తే రియల్ ఎస్టేట్ దందాలు ఎక్కడ పడగవిప్పుతాయో అక్కడ గన్ కల్చర్ మొదలవుతుందని క్రైమ్ థియరీని గమనించిన వారు అంటున్న మాట.  

ఇవన్నీ పక్కన పెడితే అభివృద్ధి విషయంలో ఈ రోజుకీ ఇతర ప్రాంతాలతో పోటీ పడలేని సిక్కోలు జిల్లా ఈ గన్ కల్చర్ లో మాత్రం ముందుకు రావడం పట్ల భయాలే వ్యక్తం అవుతున్నాయి. ఇది ఒక విధంగా ప్రగతికి విఘాతం కలిగించే పరిణామమ‌ని అంటున్నారు. మరింత గట్టిగా పోలీసులు వ్యవహరించి మొగ్గలోనే ఇలాంటి కల్చర్ ని తుదముట్టించకపోతే పెరిగి పెద్దది కావడం ఖాయమని కూడా అంటున్నారు. చూడాలి మరి పోలీస్ విచారణలో స‌ర్పంచ్ మీద జరిగిన  ఈ హత్యా యత్నం మీద ఎటువంటి సంచలనాలు  బయటకు వస్తాయో.