సానియా మీర్జా సంపాదించిన ప్రైజ్ మ‌నీ ఎంతంటే!

2022 టెన్నిస్ సీజ‌న్ తో త‌ను కెరీర్ కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది సానియా మీర్జా. దాదాపు ప‌దిహేను సంవ‌త్స‌రాల కెరీర్ ను సానియా ముగిస్తోంది. గ‌త కొన్నేళ్లుగా ఈమె ఫామ్ అంతంత మాత్రంగా ఉంది.…

2022 టెన్నిస్ సీజ‌న్ తో త‌ను కెరీర్ కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది సానియా మీర్జా. దాదాపు ప‌దిహేను సంవ‌త్స‌రాల కెరీర్ ను సానియా ముగిస్తోంది. గ‌త కొన్నేళ్లుగా ఈమె ఫామ్ అంతంత మాత్రంగా ఉంది. మేజ‌ర్ టెన్నిస్ టోర్నీల్లో డ‌బుల్స్ లో కూడా సానియా ఉనికి అంతంత మాత్రంగానే క‌నిపిస్తూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో సానియా రిటైర్మెంట్ ను ప్ర‌క‌టించింది. 

ఇండియా నుంచి టెన్నిస్ ప్లేయ‌ర్లు రావ‌డ‌మే అపురూపం. అందునా మ‌హిళా టెన్నిస్ కు సంబంధించి సానియాకు ముందు ఇండియా ఉనికి లేన‌ట్టే. ఇక సానియా స్ఫూర్తితో చాలా మంది యువ‌తులు టెన్నిస్ బ్యాట్లు ప‌ట్టినా… అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై మెరిసిన వారు క‌నిపించ‌డం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో సానియా ప్ర‌తిభ‌ను త‌క్కువ అంచ‌నా వేసేదేమీ లేదు. సింగిల్స్ లో సానియా అద్భుతాలు చేయ‌లేక‌పోయినా… డ‌బుల్స్ లో మాత్రం అనేక టోర్నీల్లో విజ‌యం సాధించింది. వేర్వేరు పార్ట్ న‌ర్ల‌తో ఉనికిని చాటింది. 

టెన్నిస్ స్టార్ల ట్రాక్ రికార్డును అప్ప‌టి వ‌ర‌కూ సంపాదించిన ప్రైజ్ మ‌నీతో కూడా కొలుస్తారు. గ్రాండ్ స్లామ్ టోర్నీల సింగిల్స్ విజేత‌ల ప్రైజ్ మ‌నీ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ ప్ర‌కారం గ్రాండ్ స్లామ్ చాంఫియ‌న్ల ఖాతాలో భారీ మొత్తాలుంటాయి.

ఇంత‌కీ సానియా త‌న కెరీర్ లో సాధించిన ప్రైజ్ మ‌నీ ఎంత‌? అంటే.. యాభై కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంద‌ని తెలుస్తోంది. సానియా డ‌బుల్స్ విజ‌యాల ద్వారా సంపాదించిన ప్రైజ్ మ‌నీ ఇది. టెన్నిస్ లో టోర్నీల పేరు ప్ర‌ఖ్యాతుల‌ను బ‌ట్టి ప్రైజ్ మ‌నీ ఉంది.

గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో డ‌బుల్స్ లో విజ‌యం సాధించిన భారీ ప్రైజ్ మనీనే ద‌క్కుతుంది. సానియా ఖాతాలో ఆ స్థాయి విజ‌యాలు పెద్ద‌గా లేవు. గ్రాండ్ స్లామ్ ల‌తో పోలిస్తే.. ప్రైజ్ మ‌నీ విష‌యంలో త‌క్కువ స్థాయి టోర్నీల్లోనే సానియాకు ఎక్కువ విజ‌యాలు ద‌క్కాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె సాధించిన‌ ప్రైజ్ మ‌నీ యాభై కోట్ల రూపాయ‌ల స్థాయిలో ఘ‌న‌మైన విష‌య‌మే.

ఇది టెన్నిస్ టోర్నీల విజ‌యాల‌, ర‌న్న‌ర‌ప్ ల ప్రైజ్ మనీ మాత్ర‌మే. కెరీర్ ఆరంభంలోనే సానియాకు అనేక ఎండోర్స్ మెంట్ డీల్స్ ద‌క్కాయి. వీటి ద్వారా కూడా ఈ ప‌దిహేనేళ్ల కాలంలో ఆమె సంపాద‌న భారీగానే ఉండ‌వ‌చ్చు.