ఉమ్మ‌డి కుటుంబానికి 56 ఏళ్లు

“బ‌ల‌గం” హిట్‌కి కార‌ణం ఎమోష‌న్స్‌. అన్నాచెల్లెలు, అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అనుబంధాలు నిరంత‌రం. అయితే ఉపాధి, ఉద్యోగాలు, చిన్న‌చిన్న కోపాలు ఇవ‌న్నీ విడ‌దీస్తాయి. ఇప్పుడు ఉమ్మ‌డి కుటుంబాలు లేవు కాబ‌ట్టి, వేర్వేరు ఊళ్ల‌లో వుంటూ పండ‌గ‌ల‌కి…

“బ‌ల‌గం” హిట్‌కి కార‌ణం ఎమోష‌న్స్‌. అన్నాచెల్లెలు, అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అనుబంధాలు నిరంత‌రం. అయితే ఉపాధి, ఉద్యోగాలు, చిన్న‌చిన్న కోపాలు ఇవ‌న్నీ విడ‌దీస్తాయి. ఇప్పుడు ఉమ్మ‌డి కుటుంబాలు లేవు కాబ‌ట్టి, వేర్వేరు ఊళ్ల‌లో వుంటూ పండ‌గ‌ల‌కి క‌లుసుకుంటారు. డ‌బ్బు త‌గాదాలు, ఇగోల వ‌ల్ల ఎదురు ప‌డినా మాట్లాడుకోని వాళ్లు వుంటారు. ప్ర‌తి వూళ్లోను , ప్ర‌తి ఇంట్లోనూ వుంటారు. ఈ పాయింట్‌ని బ‌లంగా చెప్ప‌డ‌మే బ‌లగం స‌క్సెస్‌. సినిమా చివ‌ర్లో క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం ఎందుకంటే, పిల్ల‌లు క‌లిసి వుండాల‌ని అమ్మానాన్న అనుకుంటారు. ఒక‌ర్నొక‌రిని ద్వేషించుకునే పిల్ల‌ల్ని చూసి అంద‌రి కంటే ఎక్కువ వాళ్లే బాధ‌ప‌డ‌తారు. బ‌లగంలో చ‌నిపోయిన పెద్దాయ‌న కూడా, కూతురు దూర‌మైన క‌ష్టాన్ని జీవితమంతా భ‌రించి వుంటాడు.

తెలుగులో ఎమోష‌న్స్‌పై ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. సామాజిక చ‌రిత్ర‌ని రికార్డు చేయ‌డం కూడా సినిమాలో ఒక భాగం. 1960 త‌ర్వాత వ్య‌వ‌సాయంలో క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ప‌ట్ట‌ణాల‌కి వ‌ల‌స పెరిగింది. ఉమ్మ‌డి కుటుంబాల్లో ప‌గుళ్లు మొద‌ల‌య్యాయి. వేరు కాపురాలు ప్రారంభ‌మ‌య్యాయి. స‌రిగ్గా ఇదే పాయింట్‌తో 1967, ఏప్రిల్‌లో ఎన్టీఆర్ సొంత బ్యాన‌ర్‌లో ఉమ్మ‌డి కుటుంబం తీసాడు.

ప్రారంభ‌మే స‌తీసావిత్రి నాట‌కం. సావిత్రిగా వాణిశ్రీ‌, య‌ముడిగా ఎన్టీఆర్‌. వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌తోనే 1978లో ల‌వ‌కుశ నిర్మాత శంక‌ర్‌రెడ్డి స‌తీసావిత్రి తీయ‌డం విశేషం. నాట‌కంలో స‌త్య‌వంతుడిగా రాజ‌బాబు న‌టిస్తే, సినిమాలో కృష్ణంరాజు న‌టించాడు (1957లో ఎస్వీఆర్‌, ఏఎన్ఆర్ వ‌ర‌లక్ష్మితో కూడా స‌తీసావిత్రి వ‌చ్చింది).

వ్య‌వ‌సాయం దేశం మొత్తం మీద అధ్వానంగా ఉంద‌ని రేలంగి అన‌డంతో ఆ కుటుంబం ఆర్థిక స్థితిని ఒక్క మాట‌తో చెబుతాడు ద‌ర్శ‌కుడు యోగానంద్‌.

క‌థ‌లో న‌లుగురు అన్న‌ద‌మ్ములు. రేలంగి ప‌ట్నంలో గుమాస్తా, స‌త్య‌నారాయ‌ణ వ్య‌వ‌సాయం, ప్ర‌భాక‌ర్‌రెడ్డి డాక్ట‌ర్ చ‌దువుతూ వుంటాడు. ఆఖ‌రి వాడు ఎన్టీఆర్ నాట‌కాలు వేస్తూ ప‌నీపాటా లేకుండా ఉంటాడు.

సూర్య‌కాంతం , ఎస్‌.వ‌ర‌ల‌క్ష్మి, సావిత్రి తోడికోడ‌ళ్లు. హేమ‌ల‌త కుటుంబ పెద్ద‌. సూర్య‌కాంతం వుంటే ఇంటిని వేరు చేసే వ‌ర‌కూ నిద్ర‌పోదు. గొడ‌వ‌లు పెట్టేస్తుంది. ఎస్‌.వ‌ర‌ల‌క్ష్మి మొగున్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. భార్య సావిత్రి ప‌ల్లెటూరి గ‌బ్బిలాయిలా వుంద‌ని డాక్ట‌ర్ చ‌దివిన ప్ర‌భాక‌ర్‌రెడ్డి సిటీలో ఒకమ్మాయి (ఎల్‌.విజ‌య‌ల‌క్ష్మి) ఆక‌ర్ష‌ణ‌లో ప‌డ‌తాడు.

క‌ష్టాల‌న్నీ చుట్టుముట్టి , ఇంట్లో గొడ‌వ‌లు లేస్తాయి. వ‌దిన బాధ చూడ‌లేక అన్న కోసం ఎన్టీఆర్ ప‌ట్నం వెళ్తాడు. దారిలో హీరోయిన్ కృష్ణ‌కుమారి కారు చెడిపోతే దాన్ని తోస్తాడు (అప్ప‌ట్లో కారు చెడిపోయి రోడ్డు మీద ఉన్న హీరోయిన్‌కి హెల్ప్ చేయ‌డం ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ ట్రాక్‌. మొహ‌మాటం లేకుండా కొన్ని డ‌జ‌న్ల సినిమాల్లో వాడారు).

త‌ర్వాత వాళ్ల మ‌ధ్య ల‌వ్‌. హీరోకి చ‌దువు చెప్పి మాడ్ర‌న్‌గా మారుస్తుంది. అప్ప‌ట్లో ఎన్టీఆర్ సినిమాలు మారువేషాలు లేకుండా వుండేవి కావు. కొన్నింటిలో ఐదారు వేషాలు కూడా వుండేవి.

దీంట్లో కూడా ఎల్‌.విజ‌య‌ల‌క్ష్మిని ట్రాప్ చేయ‌డానికి సూటు, టోపీతో వ‌చ్చి పాట‌లు పాడి, అన్న‌ని ఆమె బారి నుంచి ర‌క్షించుకుంటాడు. ర‌క‌ర‌కాల నాట‌కాలు, డ్రామాల మ‌ధ్య అన్న‌ద‌మ్ములు ఏక‌మ‌వుతారు. తోడికోడ‌ళ్లు ఒక్క‌ట‌వుతారు. దాదాపు మూడు గంట‌ల సినిమాలో రాజ‌బాబు, అల్లు రామ‌లింగ‌య్య కామెడీ ట్రాక్‌లు, క‌థ మ‌ధ్య‌లో చొర‌బ‌డుతుంటాయి. వాణిశ్రీ అప్ప‌టికీ కామెడీ న‌టే.

త‌ర్వాత ఇంచుమించు ఇదే క‌థ‌తో ఎన్టీఆర్ తీసిన కోడ‌లు దిద్దిన కాపురం (1970)లో ఆమె హీరోయిన్‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు కూడా యోగానంద్ కావ‌డం విశేషం.

ఉమ్మ‌డి కుటుంబం టైటిల్ సాంగ్‌తో పాటు “భ‌లే మోజుగా త‌యారైన”, “చెప్పాల‌ని వుంది” పాటలు సూప‌ర్‌హిట్ (సంగీతం టివి రాజు). 17 కేంద్రాల్లో శ‌త దినోత్స‌వం చేసుకుని, 1968లో జ‌రిగిన మాస్కో చిత్రోత్స‌వానికి ఎంపికైన ఈ సినిమా యూట్యూబ్‌లో వుంది. ఆస‌క్తి వుంటే చూడండి.

జీఆర్ మ‌హ‌ర్షి