సాధారణంగా మాయా మశ్చీంద్ర అంటారు, కానీ సుధీర్ బాబు సినిమాకు మామా మశ్చీంద్ర అనే టైటిల్ పెట్టారు. ఆ ట్విస్ట్ ఏంటి? ఇందులో సుధీర్ బాబు 3 గెటప్స్ వేశాడు. మరి ఆ 3 గెటప్స్ మధ్య ఉన్న లింక్ ఏంటి? మొన్నటివరకు ఈ సినిమా చుట్టూ తిరిగిన పెద్ద అనుమానాలివి. ఇప్పుడీ రెండు ప్రశ్నలకు సమాధానాలు దొరికేశాయి.
టైటిల్ వెనక ట్విస్ట్ ను దాచిపెట్టాలనుకోలేదు మేకర్స్. అంతేకాదు, 3 ప్రధాన పాత్రల మధ్య కనెక్షన్ ను కూడా సీక్రెట్ గా ఉంచాలనుకోలేదు. కొద్దిసేపటి కిందట విడుదలైన మామా మశ్చీంద్ర ట్రయిలర్ లో ఈ రెండు విషయాల్ని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు.
ఇద్దరు అన్నదమ్ములు, వాళ్లకు ఓ మామ.. ఈ మూడు పాత్రలూ సుధీర్ బాబే పోషించాడు. చెల్లెలి కొడుకులపై కసితో ఉంటాడు మామ. కానీ కొడుకులిద్దరూ మామ కూతుళ్లను సిన్సియర్ గా ప్రేమిస్తారు? క్లైమాక్స్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనేలా టీజ్ చేస్తూ ట్రయిలర్ ను భలే కట్ చేశారు.
సాధారణంగా ఇలాంటి కథలు, క్యారెక్టర్లు ఉన్న సినిమాలకు ట్రయిలర్ కట్ చేయడం కత్తిమీద సాము. కానీ మామా మశ్చీంద్ర ట్రయిలర్ మాత్రం సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది. 3 పాత్రల్లో 2 పాత్రల కోసం లుక్ మార్చిన సుధీర్ బాబు, కేవలం మేకోవర్ తోనే సరిపెట్టకుండా, డబ్బింగ్ కూడా వేరే వాళ్లతో చెప్పించడం బాగుంది. అయితే ట్రయిలర్ లో దుర్గ పాత్రపై పెద్దగా ఎలివేషన్లు, డైలాగ్స్ ఇవ్వలేదు. ఆ పాత్ర చుట్టూ ఏదో పెద్ద తతంగమే ఉన్నట్టు కనిపిస్తోంది.
ఓవరాల్ గా మామా మశ్చీంద్ర సెటప్, జానర్, కాన్ ఫ్లిక్ట్ అన్నీ బాగా కుదిరాయి. నటుడు హర్షవర్థన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఇషా రెబ్బా, మిర్నాళిని రవి హీరోయిన్లుగా నటించారు. చైతన్ భరధ్వాజ్ సంగీతం అందించాడు. అక్టోబర్ 6న థియేటర్లలోకి వస్తున్నాడు మామా మశ్చీంద్ర.