అప్పటి సీఎం కేండిడేట్.. అసహ్యమైన హిందూ వాదన!

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గుర్తున్నాయా? అప్పట్లో బ్రహ్మచారులను, సన్యాసులను, స్వాములను, కాషాయాంబరధారులను ముఖ్యమంత్రులుగా ప్రకటిస్తే మైలేజీ ఎక్కువ ఉంటుందనే భావనలో భారతీయ జనతా పార్టీ ఉంది. అప్పటికే యోగి ఆదిత్యనాధ్ ను ఉత్తరప్రదేశ్…

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గుర్తున్నాయా? అప్పట్లో బ్రహ్మచారులను, సన్యాసులను, స్వాములను, కాషాయాంబరధారులను ముఖ్యమంత్రులుగా ప్రకటిస్తే మైలేజీ ఎక్కువ ఉంటుందనే భావనలో భారతీయ జనతా పార్టీ ఉంది. అప్పటికే యోగి ఆదిత్యనాధ్ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసి వారు కొంత సత్ఫలితాలను సాదిస్తున్నారు. 

ఆ క్రమంలో అప్పుడొచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు స్వామి పరిపూర్ణానందను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన వల్ల కొత్తగా జరిగిన లాభనష్టాల సంగతేమో గానీ.. తెలంగాణలో అంతో ఇంతో సీట్లు గెలుచుకోగల సత్తా ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఆ ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క సీటుకే పరిమితం అయింది. అంత దారుణంగా ఓడిపోయింది. ఆ రకంగా అప్పుడు సీఎం అభ్యర్థి అయిన ఈ పరిపూర్ణానంద అనే సన్యాసి మీకు గుర్తున్నారా? ఆయన ఇప్పుడు ఈ దేశం అసహ్యించుకునే ఒక సరికొత్త వాదనను తెరమీదికి తెస్తున్నాడు. 

ఈ దేశంలో హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలట.. ఇదీ పరిపూర్ణానంద తాజా డిమాండ్. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉందిట. దీనికోసం అన్ని స్థాయిల్లోను ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలట. ఆయనగారు తాజా డిమాండ్ ను వినిపిస్తున్నారు. ఇంకా నయ్యం.. అన్ని మతాల వాళ్లూ దీనికోసం పోరాడాలని అనడం లేదు. 

అయినా భారతదేశం అనే ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశపు ఆత్మిక సౌందర్యం అనేది భిన్నత్వంలో ఏకత్వంలోనే ఉంది. పరమత సహనంలోనే ఉంది. అన్ని మతాలను సమానంగా చూసే లౌకికత్వంలోనే ఉంది. ఆ మౌలికమైన భారతీయ ఆత్మను మంటగలిపేస్తూ.. హిందూ ధర్మ ప్రచారకులం అని తమకు తాము కిరీటాలు పెట్టి చాటుకునే ఇలాంటి వ్యక్తులు చేసే ప్రకటనలు దేశంలో చిచ్చు పెడతాయి. 

పరిపూర్ణానంద అనే కాషాయ వ్యక్తి మాటలకు రాజకీయంగా ఎలాంటి విలువ లేదు కాబట్టి సరిపోయింది గానీ.. హిందువులకు తప్ప మరెవ్వరికీ ఆధార్ కార్డు ఇవ్వడానికే వీల్లేదు అనే తరహా డైలాగులు.. కేంద్రంలో అధికారం ఉన్న నాయకుల నోటినుంచి వచ్చి ఉంటే చాలా పెద్ద రభసే జరిగేది. 

అసలే భాజపా సర్కారులో ఇతర మతాల వాళ్లు అభద్రతకు గురవుతున్నారని ప్రపంచమంతా ప్రచారం సాగుతున్న తరుణంలో.. ఇలాంటి తలలేని అతివాదుల మాటలు మన దేశం పరువు తీస్తాయనడంలో సందేహం లేదు.