ఏపీ శాసనమండలి రద్దు ఊహాగానాలు గట్టిగానే సాగుతూ ఉన్నాయి. మండలి రద్దు కాబోతోందనే ప్రచారమే గట్టిగా సాగుతూ ఉంది. సోమవారం ఇందుకు సంబంధించి అసెంబ్లీ తీర్మానం చేస్తుందనే ఊహాగానాలూ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం చర్చ చేపట్టనుంది. మరి అది రద్దు తీర్మానంగా మారితే..మండలికి మూడినట్టే.
అయితే మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ చేసినా.. దానిపై కేంద్రం ఆమోద ముద్రపడాల్సి ఉందని, దానికి సమయం పట్టవచ్చని తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ చేసినా…అది కేంద్రం ఆమోదం పొందే వరకూ మండలి కొనసాగుతుందని, దానికి కనీసం ఆరు నెలల సమయం పట్టవచ్చని టీడీపీ వాళ్లు చెప్పుకుంటున్నారు.
ఒకవేళ మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదిస్తే.. అది తెలుగుదేశం పార్టీకి టిట్ ఫర్ టాట్ లాంటిదే. ఇప్పటికిప్పుడు రద్దు కాకపోయినా.. ఏ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాకా మండలి రద్దు అయినా.. తెలుగుదేశం పార్టీకి అది ఝలక్కే అవుతుంది. యనమల, లోకేష్ లాంటి వాళ్లంతా మాజీ ఎమ్మెల్సీలుగా మిగిలిపోతారు. అలాగే ఏపీ లో ఎలాంటి బిల్లులనూ తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు. అలా జగన్ తనతో పెట్టుకోవద్దు అని చంద్రబాబుకు కూడా గట్టి ఝలక్ ఇచ్చినట్టుగా అవుతుంది.
అయితే ఇక్కడ రెండో కోణం ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి సంబంధించినది. ఇప్పుడు జగన్ కేబినెట్లో ఇద్దరు మంత్రులు మండలి సభ్యులే. వారిద్దరూ ఎమ్మెల్యేలుగా నెగ్గలేకపోయినా వారికి జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. అనేక సమీకరణాలు ఏమీ లేవు అందులో. తన కోసం గతంలో మంత్రి పదవులను త్యాగం చేసిన వాళ్లు వారు. కాబట్టి ఎమ్మెల్యేలు కాకపోయినా వారికి జగన్ మంత్రి పదవులు ఇవ్వగలిగారు. అలా తను చేయాలనుకున్నది జగన్ చేయగలిగారు. ఒకవేళ మండలి రద్దు అయితే.. ఇకపై జగన్ కు కూడా అలాంటి అవకాశాలు ఉండవు!
కేవలం వారిద్దరు మాత్రమే కాదు.. రాజకీయ సమీకరణాలకు మండలి ముఖ్యమంత్రి హోదాల్లోని వారికి బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మండలి ఏర్పాటు అయినప్పటి నుంచి ఇది రుజువు అవుతూ ఉంది. అలాంటి అవకాశాన్ని ఇప్పుడు జగన్ మిస్ చేసుకున్నట్టుగా అవుతుంది. అందులోనూ ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లును మండలి అడ్డుకున్నా.. అది తాత్కాలికమే. మూడు నెలలు మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా..ఉభయ సభలనూ సమావేశ పరిచి.. బిల్లును ఆమోదించుకునే అవకాశమే ఉందంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తే.. తెలుగుదేశానికి చెక్ చెప్పవచ్చు కూడా.
ఈ రకంగా చూస్తే.. మండలి రద్దు కన్నా.. తెలివిగా తెలుగుదేశం ఎత్తుగడలను తిప్పి కొట్టే మార్గాలే రైటనిపిస్తాయి. ఇలా రెండు మార్గాలూ.. జగన్ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వీటిల్లో దేన్ని అనుసరిస్తారో మరి!