పవన్.. అత్యంత అసమర్థ ధోరణికి ఇదే రుజువు!

పవన్ కల్యాణ్ తన నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ ను వెంటబెట్టుకుని హస్తినకు వెళ్లారు. అక్కడి కమలదళపతులతో మంతనాలు సాగించి.. వచ్చే ఎన్నికలకు సంబంధించిన బేరం తెగ్గొట్టుకోవాలనేది అసలు ఎజెండా. చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయడానికి,…

పవన్ కల్యాణ్ తన నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ ను వెంటబెట్టుకుని హస్తినకు వెళ్లారు. అక్కడి కమలదళపతులతో మంతనాలు సాగించి.. వచ్చే ఎన్నికలకు సంబంధించిన బేరం తెగ్గొట్టుకోవాలనేది అసలు ఎజెండా. చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయడానికి, ఆయన పల్లకీ మోయడానికి తనతో పాటు ఏపీ కమలదళం కూడా కలిసొచ్చేలా ఢిల్లీ పెద్దలు తోడ్పాటు అందిస్తారా? లేదా? అనే విషయాలన్నింటినీ తేల్చుకోవడానికి పవన్ తన తాజా షెడ్యూలు పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. 

ఆ సంగతి పక్కన పెడితే.. రాష్ట్రానికి ఏదో ఒకటి చేసినట్టుగా, తాను ప్రజలకోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా కనిపించడానికి కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కూడా కలిసి పోలవరం ప్రాజెక్టుకు సహకరించడం గురించి ఒక వినతిపత్రం సమర్పించారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో పవన్ కల్యాణ్ కేంద్రమంత్రికి నివేదించిన విషయాలను గమనిస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది. ఆయన విన్నపాలు చేయడానికి వెళ్లారా..? జగన్ మీద పితూరీలు చేయడానికి వెళ్లారా? అని అనుమానం కూడా కలుగుతుంది. 

రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిధుల కొరత నెపంతో జాప్యం చేస్తోందని, దీనివల్ల నిర్మాణ పనుల్లోపురోగతి దెబ్బతింటోందని పవన్ పితూరీ చెప్పారు. నిధుల కొరత అనే విషయంలో అబద్ధం ఏముంది? కేంద్రం సకాలంలో పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులు ఇవ్వడం లేదని, ఏపీలో పసిపిల్లాడిని అడిగినా చెప్తారు. పోలవరం మీద పవన్ కు శ్రద్ధ ఉంటే.. కేంద్ర బడ్జెట్ లో ఎంత కేటాయించారో జలవనరుల మంత్రిని అడిగి ఉండాల్సింది. 

నిధులు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని వారిని నిలదీసి, ప్రశ్నించి ఉండాల్సింది. ఇక్కడ గర్జనలు చేస్తూ.. ఢిల్లీ పెద్దల వద్ద పిల్లికూతలు కూస్తూ ఉండే పవన్ కల్యాణ్ కేంద్రం నిధులు విడుదల చేయకపోవడానికి కూడా జగన్ ను నిందిస్తే ఎలా చెల్లుతుంది?

నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ విషయంలో కూడా జగన్ సర్కార్ శ్రద్ధ చూపడం లేదనేది పవన్ ఆరోపణ. ఇవన్నీ కేంద్రంతో ముడిపడి ఉన్న విషయాలే కదా. పోలవరం విషయంలో పవన్ కు దమ్ముంటే కేంద్రం నిధులు సకాలంలో ఇవ్వకుండా వివక్ష చూపిస్తోందని అడగాలి. 

అదేం లేకుండా.. పనులు జాప్యం జరుగుతున్న తీరును జగన్ ప్రభుత్వ వైఫల్యంలాగా ముడిపెట్టి, ఎవరైతే అసలు పాపం చేస్తున్నారో అదే వ్యక్తులకు పితూరీ చేయడం చిత్రంగా ఉంది. పవన్ కల్యాణ్ తలాతోకాలేని అసమర్థ వైఖరికి ఇదే పెద్ద నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.