ఇంతకీ ధర్మాన వారు ఏమి చెబుతున్నట్లు…?

రాజకీయాల్లో ఉన్నపుడు రాజకీయమే చేయాలి. మేధావులు మాట్లాడే భాష వాడకూడదు. ఆటలో దిగాక కసిగా ఆడాలి. బేలగా మాట్లాడకూడదు. ఈ విషయాలు సీనియర్ రాజకీయ నేత, మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావుకు తెలియవు అని…

రాజకీయాల్లో ఉన్నపుడు రాజకీయమే చేయాలి. మేధావులు మాట్లాడే భాష వాడకూడదు. ఆటలో దిగాక కసిగా ఆడాలి. బేలగా మాట్లాడకూడదు. ఈ విషయాలు సీనియర్ రాజకీయ నేత, మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావుకు తెలియవు అని ఎవరూ అనుకోరు.

కానీ ఆయన ఈ మధ్య ఎందుకో చాలా విషయాలు మాట్లాడుతున్నారు. వాటి వల్ల వైసీపీకి ఆయనకు కూడా రాజకీయ లాభం కంటే నష్టమే వాటిల్లుతోంది అని స్పష్టంగా తెలుస్తున్నా ధర్మాన వారు అలాగే ముందుకు పోతున్నారు. ధర్మాన శ్రీకాకుళంలో తాజాగా వైఎస్సార్ ఆసరా పధకం సభలో మాట్లాడుతూ చాలానే చెప్పారు. 

వైసీపీ పథకాలు తీసుకుని తిడితే అంతకంటే సంస్కార హీనత మరోటి ఉండదని అన్నారు. జగన్ ఇంట్లో డబ్బులు తెచ్చి పధకాలు ఇస్తున్నారా అని కొంతమంది పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు.ఇవి అనుచితమైన వ్యాఖ్యలు అని విమర్శలు వస్తున్నాయి. పధకాలు ఇచ్చే మనసు ప్రభుత్వ పెద్దలలో ఉంటేనే కదా అవి జనాల వద్దకు వచ్చేవి, చేరేవి అని ఆయన అంటున్నారు. 

నేరుగా నగదు బదిలీని అమలు చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం కొత్త ఒరవడిని సృష్టించిందని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఉంచుకుంటారో తెంచుకుంటారో అని జనాల మీద లేని పోని అనుమానాలను ధర్మాన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది మే వరకూ పధకాలు అందుతాయని ఆ మీదట వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తేనే అందుతాయని లేకపోతే ఇంతే సంగతులు అని ధర్మాన అంటున్నారు.

తాను పోటీ చేయడం గెలవడం అన్నది అసలు ప్రశ్నే కాదని వైసీపీ ప్రభుత్వం గెలవడం ముఖ్యమని ఆయన చెబుతున్నారు. ధర్మాన గెలవడం ఇష్యూ కాదని ఆయన అనుకోవచ్చు కానీ రాజకీయాల్లో అలా ఎవరైనా ఎందుకు అనుకుంటారు. ఒక సీనియర్ మంత్రి ఓడితే అది పార్టీకి డ్యామేజే కదా. నేనూ గెలుస్తా పార్టీ గెలుస్తుంది అని గట్టిగా చెప్పాల్సిన ధర్మాన వారు వైసీపీని ఓడిస్తే మీకే నష్టం అని చెప్పడం జనాలను హెచ్చరించడంలా లేదు బెదిరించడంలా ఉందని అంటున్నారు. అంతే కాదు వైసీపీ ఓడిపోతుంది అని పదే పదే అన్యాపదేశంగా చాటి చెబుతున్నట్లుగా ఉందని అంటున్నారు.

రాజకీయాలో గెలుస్తామని ఆఖరి ఓటు లెక్కింపు వరకూ చెప్పాలి. అంతే కానే ఓడిపోతామని చెప్పినా ఓడించకండి అని చెప్పినా కూడా వేరే అర్ధాలకు అది దారి తీస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసేది గెలవడం కోసమే. ధర్మాన నా గెలుపు ఎందుకు అనడం కూడా కాడె వదిలేసి వేదాంతం వల్లించడం లాంటిదే అంటున్నారు. పెద్దాయన వైసీపీ మేలు కోరుతూ చెబుతున్న మాటలు జనాలకు చేరేసరిగా అర్ధాలు మారితేనే అసలైన తకరారు అని అంటున్నారు. విపక్షాలు ఇప్పటికే దాన్ని తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.