బాణం వేసిన జగన్- అంపశయ్యపై పడిన రామోజీ?

“బలవంతుడ నాకేమని..పలువురితో నిగ్రహించి పలుకుట మేలా..బలవంతమైన సర్పము..చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!” Advertisement ఇది అందరికీ తెలిసిన పద్యం. ఆ మధ్యన “తెలుగు వెలుగు” అని ఒక పత్రికను నడిపి మూసేసిన రామోజీరావుకి…

“బలవంతుడ నాకేమని..పలువురితో నిగ్రహించి పలుకుట మేలా..బలవంతమైన సర్పము..చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!”

ఇది అందరికీ తెలిసిన పద్యం. ఆ మధ్యన “తెలుగు వెలుగు” అని ఒక పత్రికను నడిపి మూసేసిన రామోజీరావుకి కూడా ఈ పద్యం అర్ధం కరతలామలకమే. అర్ధం చెప్పాల్సిన పని లేదు. 

దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా మీడియాని నడిపి, కింగ్ మేకర్ అనిపించుకుంటూ ఎదిగి, వందలాది ఎకరాల భూమికి సామ్రాట్టుగా ఉంటూ, తనని కదిపే శక్తి గానీ, కుదిపే భయం కాని ఈ జన్మకు రాదనుకునేంత స్థాయిలో నిలబడ్డ రామోజీరావు నేడు సీ.ఐ.డి విచారణకి బెదిరి మంచమెక్కారన్న అపఖ్యాతిని కూడగట్టుకున్నారు. 

గతంలో తన పత్రికలో ఎన్నో రాతలు ఎన్నో విధాలుగా రాసి, ప్రత్యర్థులకి ప్రశాంతత లేకుండా చేసిన పనికి ఇప్పుడిలా కాలం సమాధానం చెబుతోందంటున్నాయి సోషల్ మీడియా పోస్టులు. “అసలు రామోజీరావుకి విచారణా?” అంటూ ఆశ్చర్యపోతున్నారు కూడా కొందరు. 

జీవితమనేది మహల్లో బతికే వాడికైనా, గుడిసెల్లో నివసించే వాడికైనా ఒకటే. ఎంత గొప్పగా బతికామన్నది ఎన్ని విలువలకి కట్టుబడి ఉన్నాం, ఎంత ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కున్నాం అన్న దానిని బట్టి ఉంటుంది. విలువలనేవి ఎంచుకున్న మార్గాన్ని బట్టి, వృత్తిని బట్టి, వ్యాపారాన్ని బట్టి మార్చుకుంటే మార్చుకోవచ్చు గాక…కానీ వాటి పర్యవసానాల్ని ఎదుర్కునే దమ్ము ధైర్యం ఉండాలి. లేకపోతే ఇంత బతుకూ బతికి ఇలా పిల్లిపిల్లలాగ దాక్కోవడమేంటనే వెక్కిరింపు చరిత్రలో నమోదైపోతుంది. గంభీరమైన  కీర్తి కాస్తా అభాసుపాలౌతుంది. 

“ఎవడు ఏ విచారణకి పిలిస్తే ఏంటి..ఎదుర్కోవడానికి నాకేం భయం” అనాలని రామోజీ రావు స్థాయి వ్యక్తి నుంచి ఎవరైనా ఆశిస్తారు. అసలా డైలాగే లేకుండా కుక్కిన పేనల్లే మంచానికి అతుక్కుపోతే ఏమనాలి? పైగా నడుముకి ఒక బెల్టు, చేతికి వాచీ. 

ఆయన నిజంగా అనారోగ్యం పాలైతే కచ్చితంగా అది మానవత్వంతో పరిగణించాల్సిన విషయమే. కానీ సరిగ్గా విచారణకు ముందే అనారోగ్యమంటేనే అందరికీ అనుమానాలొస్తున్నాయి. 

అరెష్టులకి ముందు ఈ ప్రక్రియ ప్రతి సామాన్యుడు ఫాలో అయ్యేదే. కానీ ఉండవల్లి చెప్పినట్టు రామోజీరావు అసామాన్యుడు కదా! ఆయన శక్తి అంతని ఇంతని, ఆయనని ఎదుర్కోవడానికి తానెంతటివాడిని..అంటూ ఉండవల్లి తన మార్గదర్శి కేసులోని ప్రత్యర్థిని గురించి గొప్పగా చెప్తారు కానీ ఈ మంచం సీన్ చూస్తూ, సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే అంత సీను లేదేమో అనిపిస్తోంది. రామోజీ గురించి ఉండవల్లి ఎక్కువగా ఊహించారా? 

86 ఏళ్ల వయసులో దేనికీ భయపడని వాడు సంపూర్ణమైన వ్యక్తి అనుకోవాలి. ఆ వయసులో ఇంకా ధైర్యంగా బతకలేని పరిస్థితి ఉందంటే శాపమన్నా అయ్యుండాలి, లౌకికమైన విషయాల పట్ల ఆశ చావకన్నా అయ్యుండాలి. 

“పాపం పెద్దాయన” అని ఉపేక్షించకుండా జగన్ మోహన్ రెడ్డి తన బాణాల్ని సంధించాడు. మీడియా భీష్ముడు అంపశయ్యమీద పడ్డాడు. 

ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే భీష్ముడు అంపశయ్య సీన్ చూస్తే బాధ కలుగుతుంది. భారత కథలో కూడా కౌరవ, పాండవ పక్షాలు రెండూ సానుభూతి చూపాయి. 

కానీ ఇక్కడ అలా కాదు. అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవ్వరూ రామోజీరావు ఉన్న పరిస్థితిని కరుణరసాత్మకంగా తీసుకోవట్లేదు. ఒకానొక సామాజిక వర్గంలోని “ఆ” ఫీలింగ్ ఉన్నవాళ్లు, తెదేపా సానుభూతి పరులు తప్ప మిగిలిన వాళ్లంతా అదొక సెలెబ్రేషన్ లాగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమీ జరక్కపోవచ్చు. కేవలం విచారణ అనగానే తాను మంచమెక్కిన ఫొటో బయటకు రావడమే రామోజి రావు జీవితంలో అతి పెద్ద ఓటమి. దీనిని బట్టి అర్ధం కావాలి. 86 ఏళ్లల్లో సాధించింది ఏవిటో.  

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంతటి వాడు ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీ రావుని కలిసాడు. అదీ రామోజీ స్థాయి. కానీ ఒక రాష్ట్ర సి.ఎం గా తానేం చేయగలనో జగన్ చూపించాడు. ఈ స్థాయిలో ఆ సీటుకున్న పవర్ ని వై.ఎస్.ఆర్ కూడా చూపలేకపోయారన్నది నిర్వివాదాంశం. తన తండ్రి వల్లే కానిది తాను చేసి చూపించాడు జగన్. ఇది రివెంజ్ అయితే అవ్వచ్చు. కానీ తాను తప్పు చెయ్యకపోతే విచారణను ఎదుర్కోవడానికి రామోజీకి భయం దేనికి అనేది సామాన్యుడి ప్రశ్న. 

అనారోగ్య కారణముంటే విచారణని ఎగ్గొట్టొచ్చనే లాంటి వెసులుబాట్లు చట్టం ఎన్ని కల్పించినా వాటిని వాడుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళేవాడినే హీరో అంటుంది చరిత్ర. వాడుకునే వాడిని భయస్థుడిగానో లేక గడుసువాడిగానో చూస్తుందేమో తప్ప హీరోగా మాత్రం అస్సలు చూడదు. 

ఇక్కడ రామోజీరావు నిజంగా అనారోగ్యంతో ఉన్నారా?! లేక ప్రస్తుత పరిస్థితుల్లో నాటకమాడుతున్నారా అనేది తెలియదు. కానీ సోషల్ మీడియాలో పలువురు రెండోదే నమ్ముతున్నట్టుగా అనిపిస్తోంది. 

శ్రీనివాసమూర్తి