సినిమా రివ్యూ: లక్ష్మి

సమీక్ష: లక్ష్మి రేటింగ్‍: 1/5 బ్యానర్‍: ఫాక్స్ స్టార్‍ స్టూడియోస్‍ తారాగణం: అక్షయ్‍ కుమార్‍, కియారా అద్వాని, శరద్‍ ఖేల్కర్‍, అయేషా రజా మిశ్రా, అశ్విని కాలేస్కర్‍, తరుణ్‍ అరోరా తదితరులు నేపథ్య సంగీతం:…

సమీక్ష: లక్ష్మి
రేటింగ్‍: 1/5
బ్యానర్‍: ఫాక్స్ స్టార్‍ స్టూడియోస్‍
తారాగణం: అక్షయ్‍ కుమార్‍, కియారా అద్వాని, శరద్‍ ఖేల్కర్‍, అయేషా రజా మిశ్రా, అశ్విని కాలేస్కర్‍, తరుణ్‍ అరోరా తదితరులు
నేపథ్య సంగీతం: అమర్‍ మోహిలె
కూర్పు: రాజేష్‍ పాండే
ఛాయాగ్రహణం: వెట్రి పళనిసామి, ఖుష్‍ చాబ్రియా
కథ, కథనం, దర్శకత్వం: రాఘవ లారెన్స్
విడుదల తేదీ: నవంబరు 09, 2020
వేదిక: డిస్నీ హాట్‍స్టార్‍

దక్షిణాది హిట్‍ సినిమాలను వేగంగా రీమేక్‍ చేసేసే బాలీవుడ్‍ ఇండస్ట్రీ దృష్టి ‘కాంచన’పై చాలా ఆలస్యంగా పడిందనే చెప్పాలి. లారెన్స్ ‘ముని’ ఫ్రాంచైజీని ఎప్పుడో పుష్కరకాలం క్రితం మొదలు పెట్టగా, ‘కాంచన’ తొమ్మిదేళ్ల క్రితం వచ్చింది.

స్త్రీ, గోల్‍మాల్‍ అగైన్‍ లాంటి చిత్రాలకు వంద కోట్లకు పైగా వసూళ్లు అవలీలగా వచ్చి పడడంతో హారర్‍ కామెడీలపై దృష్టి పెట్టిన బాలీవుడ్‍ మేకర్స్ దృష్టి ‘కాంచన’పై పడడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఒకదానిని మించి మరొకటి హిట్టయ్యాయి.

హారర్‍ కామెడీలు పరమ రొటీన్‍ అయిపోయి ప్రేక్షకులు బోరెత్తిపోయిన టైమ్‍లో కూడా లారెన్స్ ‘కాంచన’ మాత్రం కోట్లకు కోట్లు వసూళ్లు రాబట్టగలిగింది. ఊర మాస్‍ అనిపించే తరహాలో లారెన్స్ ఈ ఫ్రాంచైజీని తీర్చిదిద్దాడు. దెయ్యాలంటే భయపడే హీరో చివరకు బాత్రూమ్‍కి వెళ్లడానికి కూడా తల్లిని తోడు తీసుకెళుతుంటాడు.

తీరా అలాంటి వాడికే దెయ్యం పడితే అమ్మ, వదిన అని తేడా లేకుండా అందరినీ చితక బాదేస్తుంటాడు. సగటు హీరో లక్షణాలు ఏమాత్రం లేని ఇలాంటి పాత్రను లారెన్స్ తనకు టైలర్‍ మేడ్‍ అనిపించుకున్నాడు. ఇక ఈ సిరీస్‍కి లారెన్స్ ఎలాగయితే కామన్‍ ఫ్యాక్టరో… అలాగే కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్‍ కూడా ప్రతి సినిమాలోను వుంటారు. 

వారితో లారెన్స్ చేయించిన కామెడీ ఎవరు చేయించినా కానీ ‘మరీ ఇంత అతి ఏంటి’ అనిపించేది. కానీ ఆ ఓవర్‍ ది బోర్డ్ కామెడీనే తన ఫ్రాంచైజీకి యు.ఎస్‍.పి.గా మార్చుకున్నాడు. అంత ఊరతనం చూసే బాలీవుడ్‍ మేకర్స్ మొదట్లో ఈ సినిమా జోలికి వచ్చినట్టు లేరు. కానీ తీసిన ప్రతి సినిమా హిట్టవుతుంటే ఇది నిజంగానే ‘కాంచనం’ అనుకుని ఏకంగా అక్షయ్‍ కుమార్‍ హీరోగా రీమేక్‍ చేపట్టారు.

దేశభక్తి నరనరాన ప్రవహించే పాత్రలతో పాటు హెరాఫెరీ లాంటి కామెడీలు కూడా అక్షయ్‍ కుమార్‍ ఈజీగా చేసేస్తుంటాడు. అయితే అంతటి స్టార్‍ని బాత్రూమ్‍కి తల్లిని తోడు తీసుకెళ్లేవాడిగా చూపించలేరుగా! అందుకే హిందీ వెర్షన్‍కి పలు మార్పుచేర్పులు చేసారు. 

దీంతో కాంచనకి అతి పెద్ద ప్లస్‍ అయిన మాస్‍ అప్పీల్‍ తగ్గిపోయింది. ఇక తమిళ, తెలుగు వెర్షన్స్ సక్సెస్‍కి కీ అయిన కోవై సరళ, దేవదర్శినికి బదులుగా నటించిన వాళ్లు అంత కన్విన్సింగ్‍గా మాస్‍ కామెడీ చేయలేకపోయారు. పెద్దావిడ పాత్రకు మద్యం తాగే అలవాటు పెట్టినా, అత్తా కోడళ్లు ఒకరినొకరు తిట్టుకున్నా అంతా తెచ్చి పెట్టినట్టుందే తప్ప హాస్యం పండలేదు. అన్నిటికంటే ముఖ్యంగా అక్షయ్‍కుమార్‍ అసలు ‘లక్ష్మి’ పాత్రలో ఇమడలేక ఇబ్బంది పడ్డాడు. ఎలాగో మొదలు పెట్టేసాం కనుక పూర్తి చేయాలనే యాంత్రికత అతని పర్‍ఫార్మెన్స్లో కనిపించింది. 

కాంచనకి ఫ్లాష్‍బ్యాక్‍ ఎపిసోడ్‍, రివెంజ్‍ కంటే కూడా హారర్‍ మరియు కామెడీ సన్నివేశాలు పెద్ద ప్లస్‍. లారెన్స్ అసలు ప్లాట్‍ విషయంలో రాంగ్‍ స్టెప్స్ వేసినా కానీ ఈ ఎలిమెంట్స్ పరంగా రైట్‍ నోట్స్ హిట్‍ చేసేవాడు. కాంచన 3 మినహా మిగతా అన్నిట్లోను లారెన్స్ హారర్‍ + కామెడీ ఫార్ములాను ఎఫెక్టివ్‍గా మిక్స్ చేయగలిగాడు. కానీ ‘లక్ష్మి’ చిత్రానికి వచ్చేసరికి లారెన్స్ తన శైలిని మార్చుకోక తప్పలేదు. 

హిందీ ఆడియన్స్ సెన్సిబులిటీస్‍తో పాటు అక్షయ్‍కుమార్‍ ఇమేజ్‍ అతడికి అడుగడుగునా అడ్డు పడింది. లారెన్స్ చేతులు కట్టేయడంతో ఈ చిత్రాన్ని పూర్తిగా మోయాల్సిన బాధ్యత అక్షయ్‍ కుమార్‍పై పడగా, అతడేమో కనీసం ట్రాన్స్జెండర్‍ బాడీ లాంగ్వేజ్‍ ప్రదర్శించాల్సిన సన్నివేశాలలో కూడా ఎలాంటి ఎఫర్టస్ పెట్టినట్టు అనిపించలేదు. 

అక్షయ్‍ కుమార్‍ అసలు వయసు దాచలేకపోగా, అతని భార్య పాత్ర చేసిన కియారాతో కెమిస్ట్రీ కూడా కుదర్లేదు. మంచి నటి అయినా కానీ ఈ చిత్రంలో ఆమె మిగతా నటీనటులతో పాటే అయోమయపు హావభావాలతో పేలవంగా కనిపించింది. పాటలంటూ లేకపోతే తన స్క్రీన్‍ టైమ్‍ కంటే అత్తా కోడళ్ల పాత్రలు చేసిన వారికే ఎక్కువ స్పేస్‍ దొరికింది. నటీనటులలో ట్రాన్స్జెండర్‍గా కనిపించిన శరద్‍ ఖేల్కర్‍ (సర్దార్‍ గబ్బర్‍సింగ్‍ ఫేమ్‍) ఒక్కడే సిన్సియర్‍ పర్‍ఫార్మెన్స్తో తన పాత్రకు న్యాయం చేసాడు.

హారర్‍ కోసం పెట్టిన స్పెషల్‍ ఎఫెక్టస్ కనీసం చిన్న పిల్లలను కూడా భయపెట్టేలా లేవు. విజువల్స్ కాకపోతే కనీసం సౌండ్‍ ఎఫెక్టస్ అయినా హారర్‍ ఫీల్‍ తీసుకురావాలి. కానీ ఈ సినిమాకి అన్ని డిపార్ట్మెంట్స్ కట్టగట్టుకుని లాస్ట్ ప్లేస్‍ కోసం పోటీ పడినట్టున్నాయి.  అవసరం లేకుండా పాటలను చొప్పించిన రాఘవ లారెన్స్ స్క్రీన్‍ప్లే పరంగా ఎలాంటి కేర్‍ చూపించలేదు. కొన్ని విషయాలను గట్టిగా మెన్షన్‍ చేసి కూడా తర్వాత వాటిని మరిచిపోయాడు. 

మామూలుగా అయితే ఇలాంటి విషయాలు చాలా పెద్ద మైనస్‍ అనిపించాలి… కానీ మన అదృష్టం కొద్దీ వాటిని మరిచిపోయారనే ఆనందం కలుగుతుంది. ఇంత ఆలస్యంగా కాంచన రీమేక్‍ చేసిన ఈ చిత్ర బృందం బహుశ అసలు ఈ చిత్రాన్ని చేయకపోయినట్టే బాగుండేదని ఇప్పుడు ఫీలవుతూ వుండొచ్చు. లాక్‍డౌన్‍ వల్ల చిత్ర పరిశ్రమ నష్టపోయిందని అంటున్నారు కానీ ఓటిటి ద్వారా వస్తోన్న సినిమాలు చూస్తోంటే చాలా మంది పాలిట కరోనా అదృష్టలక్ష్మి అయిందనే భావన కలుగుతోంది.

బాటమ్‍ లైన్‍: లక్ష్మీ విలాపం!