కాజల్ కు ఉన్నంత ధైర్యం ఈ హీరోయిన్లకు లేదా?

ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోను పొగడాలి. ఏ ఇండస్ట్రీలో ఉంటే, ఆ ఇండస్ట్రీని పొగడాలి. అవసరమైతే పక్క ఇండస్ట్రీని చులకన చేయాలి. అభద్రతాభావం నుంచి పుట్టుకొచ్చే లక్షణాలివి. ఎక్కువగా హీరోయిన్లు ఫాలో…

ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోను పొగడాలి. ఏ ఇండస్ట్రీలో ఉంటే, ఆ ఇండస్ట్రీని పొగడాలి. అవసరమైతే పక్క ఇండస్ట్రీని చులకన చేయాలి. అభద్రతాభావం నుంచి పుట్టుకొచ్చే లక్షణాలివి. ఎక్కువగా హీరోయిన్లు ఫాలో అయ్యే రూల్స్ ఇవి. వీళ్లంతా కాజల్ ను చూసి నేర్చుకోవాలి. “ఎక్కడున్నామన్నది కాదు, ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్” అనే విషయాన్ని కాజల్ తన చేతలతో చూపించింది.

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ, ముంబయిలో ఉంటూ, అదే నగరంలో జరిగిన ఓ ఫంక్షన్ లో బాలీవుడ్ లో ఉన్న లోపాల్ని ఎత్తిచూపించింది కాజల్. బాలీవుడ్ లో విలువల్లేవు, క్రమశిక్షణ లేదంటూ కుండబద్దలుకొట్టింది. ఎంతమంది హీరోయిన్లకు ఈ ధైర్యం ఉంది?

సాధారణంగా అవకాశాలు తగ్గిన తర్వాత హీరోయిన్లు ఇలా తమ మనసులో మాటలు బయటపెడతారు. నిర్భయంగా మాట్లాడతారు. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న హీరోయిన్లు కూడా ఈ బాపతే. కానీ కాజల్ అలా కాదు, ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సినిమా చేస్తోంది. మరిన్ని సినిమాలు చేయాలనుకుంటోంది. అయినప్పటికీ ఉన్నదున్నట్టు మాట్లాడింది.

మిగతా హీరోయిన్ల పరిస్థితేంటి?

మొన్నటికిమొన్న రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ మాత్రమే అన్నట్టు మాట్లాడింది రష్మిక. బాలీవుడ్ లో ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీని పొగిడేసింది. పూజాహెగ్డే సంగతి సరేసరి. సౌత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, బాలీవుడ్ నుంచి ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా ఎగిరెళ్లిపోతుంది. ప్రస్తుతం సల్మాన్ నామస్మరణ తప్ప పూజా పాప నోటి నుంచి మరో మాట రావడం లేదు. గతంలో కూడా ఇంతే.

ఇక తమన్న, రకుల్ అయితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది తమన్న. ఆమెకు గుర్తింపు వచ్చింది సౌత్ సినిమాలతోనే. దీనికి పూర్తి రివర్స్ లో బాలీవుడ్ లో ఐరెన్ లెగ్ అనే ఇమేజ్ తెచ్చుకుంది. అయినప్పటికీ తమన్నకు ఎప్పుడూ బాలీవుడ్ తలంపే. ఆమె ఆలోచనలన్నీ బాలీవుడ్ దిశగానే సాగుతాయి. ఇక రకుల్ కూడా అంతే. వరుసగా బాలీవుడ్ ఆఫర్లు వచ్చిన టైమ్ లో  ఏకంగా సౌత్ వైపు చూడడం మానేసింది.

ఇకనైనా పద్ధతి మారాలి..

ఇప్పుడు బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలే బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలు నార్త్ లో హిందీ సినిమాల కంటే బాగా ఆడాయి. ఆస్కార్ వేదికపై మెరిసిన ఆర్ఆర్ఆర్ ఓ సౌత్ సినిమా అనే విషయాన్ని మరిచిపోకూడదు. ప్రస్తుతం సౌత్-నార్త్ అనే బేధం లేదు. కంటెంట్ బాగుంటే, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా, ఎక్కడైనా ఆడుతుంది. ప్రజాదరణ పొందుతుంది.

సో.. ఇకనైనా హీరోయిన్లు ఇలా విడదీసి చూడడం, వేర్వేరుగా మాట్లాడ్డం మానుకోవాలి. మరీ ముఖ్యంగా మరో ఇండస్ట్రీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే, ఇది సోషల్ మీడియా యుగం. ఏ చిన్న కామెంట్ చేసినా అది మరో రూపంలో తెరపైకి వస్తుంది. కాజల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. గతంలో హీరోయిన్లు సౌత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన క్లిప్స్ అన్నీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.