కోర్టుల చుట్టూ బాబు.. వాటి చుట్టూ భువ‌నేశ్వ‌రి!

చంద్ర‌బాబునాయుడికి ఊహించ‌ని క‌ష్ట‌మొచ్చింది. స్కిల్ స్కామ్‌లో ఆయ‌న ఇరుక్కున్నారు. దాని నుంచి భ‌య‌ప‌డే లోపు, ఒక‌దాని వెంట మ‌రొక‌టి వ‌రుస కేసులు ఆయ‌న్ను నీడ‌లా వెంటాడుతున్నాయి. వీటన్నింటి నుంచి ఎలాగైనా బ‌య‌ట‌ప‌డాల‌ని చంద్ర‌బాబు న్యాయ…

చంద్ర‌బాబునాయుడికి ఊహించ‌ని క‌ష్ట‌మొచ్చింది. స్కిల్ స్కామ్‌లో ఆయ‌న ఇరుక్కున్నారు. దాని నుంచి భ‌య‌ప‌డే లోపు, ఒక‌దాని వెంట మ‌రొక‌టి వ‌రుస కేసులు ఆయ‌న్ను నీడ‌లా వెంటాడుతున్నాయి. వీటన్నింటి నుంచి ఎలాగైనా బ‌య‌ట‌ప‌డాల‌ని చంద్ర‌బాబు న్యాయ పోరాటానికి దిగారు. అయితే న్యాయ స్థానాల్లో ఆశించిన స్థాయిలో ఆయ‌న ఊర‌ట పొంద‌లేక‌పోతున్నారు.

అస‌లు త‌న‌పై కేసే లేకుండా చేసుకోవాల‌ని అత్యాశే ఆయ‌న్ను మ‌రింత‌గా అవినీతి కేసుల ఊబిలోకి దింపుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం, ఏసీబీ కోర్టు రిమాండ్‌కు ఆదేశించ‌డంతో మొద‌లైన క‌ష్టాలు… ఇంకా రోజురోజుకూ పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుమారుడు లోకేశ్‌ను కూడా తాజాగా మ‌రో కుంభ‌కోణంలో నిందితుడిగా చేర్చారు.

ఏసీబీ కోర్టు మొద‌లుకుని సుప్రీంకోర్టు వ‌ర‌కూ చంద్ర‌బాబునాయుడి న్యాయ‌వాదులు ఆయ‌న కోసం బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో బాబు క్వాష్ పిటిష‌న్‌పై ఇవాళ విచార‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఏసీబీ కోర్టులో బాబు బెయిల్‌, అలాగే సీఐడీ కస్ట‌డీ పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇదిలా వుండ‌గా త‌న భ‌ర్త చంద్ర‌బాబునాయుడు అవినీతి కేసుల నుంచి క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌ప‌డాల‌ని కోరుకుంటూ భువ‌నేశ్వ‌రి ఆల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేస్తున్నారు. ఇటీవ‌ల ఆమె అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ స్వామిని ద‌ర్శించుకున్నారు. బాబును కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని, క‌ష్టాల‌ను తొల‌గించాల‌ని ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు.

ఇవాళ రాజ‌మండ్రిలో లూథ‌ర‌న్ చ‌ర్చిలో టీడీపీ నేత‌ల‌తో క‌లిసి ఆమె ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. బాబును కేసుల నుంచి విముక్తుడిని చేయాల‌నే ఆమె మొర‌ను దేవుళ్లు ఎంత వ‌ర‌కు ఆల‌కిస్తారో చూడాలి. బాబు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, ఆయ‌న భార్య ఆల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.