అమరావతి రధాయాత్ర అలా ముగిసిందన్న మాట!

అమరావతి నుంచి అరసవల్లికి రధయాత్ర అంటూ అపుడెపుడో ఆర్భాటం చేశారు. సీన్ కట్ చేస్తే ఈ రోజుతో అరసవల్లిలో రధాయాత్ర అలా ముగిసిందన్న మాట. అసలు రధాయాత్ర జరిగిందా అంటే జరిగిందనే అని భావించాలి.…

అమరావతి నుంచి అరసవల్లికి రధయాత్ర అంటూ అపుడెపుడో ఆర్భాటం చేశారు. సీన్ కట్ చేస్తే ఈ రోజుతో అరసవల్లిలో రధాయాత్ర అలా ముగిసిందన్న మాట. అసలు రధాయాత్ర జరిగిందా అంటే జరిగిందనే అని భావించాలి. గత ఏడాది సెప్టెంబర్ 12న అమరావతి టూ అరసవల్లి రధయాత్ర స్టార్ట్ చేశారు.

జిల్లాలను అన్నీ దాటుకుంటూ అరసవల్లికి పెద్ద ఎత్తున పాదయాత్రగా రైతులు వచ్చి సూర్యనారాయణమూర్తికి మొక్కులు చెల్లించుకోవాలన్నది లక్ష్యం. తీరా చూస్తే ఈ రథయాత్ర అక్టోబర్ 23న తూర్పు గోదావరి జిల్లా వద్దనే ఆగిపోయింది. అయిదున్న నెలల తరువాత అక్కడ ఆగిన అమరావతి రధాన్ని ఒక్క రోజులోనే ఈ జిల్లాలను అన్నింటినీ దాటించేసి అరసవల్లి స్వామి వారి ముందు నిలిపారు.

ఆదివారం ఆ రధంతో పాటు రైతులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించారు. యాత్ర పరిసమాప్తం అనిపించారు. అమరావతి రధానికి స్థానిక తెలుగుదేశం నాయకులు స్వాగతాలు పలికారు. రైతులను సమాదరించారు.

అలా అమరావతి టూ అరసవల్లి రధయాత్ర విజయవంతంగా ముగిసినట్లుగా జేఏసీ నాయకులు ప్రకటించారు. వాస్తవానికి చూస్తే గత ఏడాది తూర్పు గోదావరి వద్ద సాగుతున్న రధ యాత్రను ఉత్తరాంధ్రా జిల్లాలలో కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని, తమ ప్రాంతానికి వచ్చి సెంటిమెంట్ ని రెచ్చికొడితే అంగీకరించమని ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి నాయకులు హెచ్చరించారు.

దాంతో గొడవలు జరుగుతాయని అంతా భావించారు. కోర్టు సైతం రైతులే పాదయాత్రలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతుల కంటే రాజకీయ నాయకులే ఎక్కువగా ఉండడంతో వారిని పక్కన పెట్టేస్తే యాత్ర ఎలా అనుకున్నారో ఏమో కానీ అలా రధయాత్రకు నాడు బ్రేక్ పడింది. ఇపుడు మొక్కులు చెల్లించారు కాబట్టి యాత్ర అయినట్లే. ఫలితం ఏమిటన్నది ముందు ముందు  చూడాల్సిందే.