అసెంబ్లీ ప్రత్యేక సమావేశం గురించి తెలుగుదేశం పార్టీ వాళ్లు మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ వాళ్లను అభినందించిన వీడియో అది. ఆ అభినందన ఎందుకో కాదు.. అసెంబ్లీలో బాగా గొడవ పడినందుకు. 'బాగా గొడవ పడ్డారు… వాళ్లు వచ్చినప్పుడల్లా గొడవపడ్డారు..' అంటూ చంద్రబాబు నాయుడు తమ వాళ్లను అభినందిస్తున్న వీడియో ఆసక్తిదాయకంగా మారింది.
ఆ వీడియోలో మిగతా తెలుగుదేశం నేతలు కూడా తమ తమ రౌడీయిజాల గురించి ఒకరినొకరు పొగుడుకున్నారు. తమను తామే రౌడీలుగా అభివర్ణించుకోవడం ఈ వీడియోలో ఉన్న కొసమెరుపు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అయితే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన రౌడీలా వ్యవహరించారని తెలుగుదేశం ఆయనకు సహచర నేతలు కితాబిచ్చారు. బెజవాడ రౌడీ అంటూ.. అశోక్ బాబుకు తెలుగుదేశం పార్టీ వాళ్లే బిరుదు ఇచ్చారు ఆ వీడియోలో.
కొంచెం ఉండుంటే కొట్టబోయేవాడు.. అంటూ అశోక్ బాబు గురించి తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పుకోవడం మండలిలో ఆయన ఏ స్థాయిలో గలాభా సృష్టించారో అర్థం చేసుకోవచ్చునేమో. ఒకరికి మించి తాము గొడవ చేసినట్టుగా, మంత్రులు వచ్చినప్పుడల్లా గొడవ పడినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు తమలో తాము చెప్పుకుంటూ, అధినేతకు చెబుతూ.. ఆనంద పడటం.. సభలో తెలుగుదేశం పార్టీ అనుసరించి వైఖరిని చాటి చెబుతూ ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.