కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించకడంపై మాజీ ఎంపీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మబంధువుగా గుర్తింపు పొందిన కెవీపీ రామచంద్రరావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అనర్హత వేటును చంద్రబాబు , పవన్, జగన్ ఖండించకపోవడంపై కేవీపీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ఢిల్లీలో వుండాల్సిన వ్యక్తని, దేశ రాజధాని కేంద్రంగా రాజకీయాలు నడపగల సమర్ధత వున్న నాయకుడని కితాబు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడకపోడానికి కారణాలున్నాయని, అవేమిటో తర్వాత వెల్లడిస్తానని కేవీపీ చెప్పుకొచ్చారు.
కేవీపీ అమాయకత్వంతో మాట్లాడారో, అతి లౌక్యంతో ఆ వ్యాఖ్యలు చేశారోగానీ రాజకీయాలు అంతగా తెలియని వారికి కూడా చంద్రబాబు వ్యవహారం బాగా తెలుసు. ఆయన ఎంత అవకాశవాదంగా వుంటారో, ఏపూటకు ఆపూట మాటలు ఎలా మారుస్తారో ఎవరికీ తెలియంది కాదు. రాహుల్ గాంధీపై అనర్హతపై కనీసం పత్రికా ప్రకటన కూడా ఇవ్వని చంద్రబాబు తీరు కేవీపీకి ఆశ్చర్యం కలిగించిందేమోగానీ, ఆయన వ్యక్తిత్వం, నైతికప్రవర్తన తెలిసిన వారికి పెద్దగా ఎలాంటి ఫీలింగ్ కలిగించలేదు.
2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత కాలంలో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అక్కడ దాదాపు ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించింది. ఆ సమయంలో ఫరూక్ అబ్దుల్లాను కేంద్ర ప్రభుత్వం గృహ నిర్భంధం చేసింది. దేశ వ్యాప్తంగా అనేక పార్టీలు కేంద్రం తీరును ఖండించాయి. కొన్ని రాజకీయ పార్టీలు బృందంగా జమ్మూ కశ్మీర్ వెళ్లాయి. ఫరూక్‌ను కలిసే ప్రయత్నం చేశాయి. కొన్ని నెలల ముందు ఫరూక్ అబ్దుల్లాను తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్న బాబు….పత్రికా ప్రకటన ద్వారా కూడా ఫరూక్ గృహ నిర్భంధాన్ని ఖండించలేదు. అసలు ఒక్క రోజు కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు.
2019 ఎన్నికల్లోనే…బీజేపీని ఓడిస్తానంటూ పలు రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటించారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తదితరులతో సమావేశాలు నిర్వహించారు. అవకాశం దొరికితే ప్రధాని కావాలని కూడా కలలుగన్నారు. దేశం కోసం అంతా ఐక్యమవుతున్నాం అని ప్రకటించారు. తీరా ఎన్నికల్లో బీజేపీ గెలిచి, మళ్లీ మోడీ ప్రధాని అయ్యారు. ఆగ్రహంతో రగిలిపోతున్న మోడీ…కోల్‌కతాలో మమతా బెనర్జీని, ఢిల్లీలో కేజ్రీవాల్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. దేశ వ్యాప్తంగా అనేక పార్టీలు మమతా బెనర్జీకి, కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలిచాయి. చంద్రబాబు మాత్రం ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ ఇద్దరు నేతలకు మద్దతు ప్రకటించలేదు. అవేవీ పట్టనట్లు వ్యవహరించారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలోనూ అదే ధోరణిని చంద్రబాబు అనుసరిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బాబు, తనకు బద్ధశుత్రువైన కాంగ్రెస్‌తో జతకట్టారు. దేశం కోసమే కాంగ్రెస్‌తో కలిశానని ఆయన ప్రకటించుకున్నారు. రాహుల్ గాంధీతో కలసి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అటువంటిది రాహుల్ గాంధీపై అనర్హత గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా….చంద్రబాబు మాత్రం నోరు మెదపలేదు. అచ్చెన్నాయుడు మాత్రం మొక్కుబడిగా ‘రాహుల్ గాంధీపై తొందరపడాల్సింది కాదు’ అని ప్రకటన ఇచ్చారు.
అవకాశం దొరికితే మళ్లీ బీజేపీతో జత కట్టాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తు న్నారు. ఇందులో భాగంగానే 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే తమ ఎంపీలను బీజేపీలో చేర్పించారు. వారి ద్వారా బీజేపీతో సంబంధాలను పునరుద్ధించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే రాహుల్ గాంధీపై వేటును బహిరంగంగా సమర్ధించగల నైతికత కలిగిన నాయకుడు చంద్రబాబు.
ఇవేవీ అర్థంకానట్లు కేవీపీ మాట్లాడారు. ఇంతటి అవకాశవాదాన్ని ఒంటబట్టించుకున్న చంద్రబాబును ‘ఢిల్లీలో వుండాల్సిన నేత’ అంటూ కీర్తిస్తున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదరకుంటే కాంగ్రెస్ పంచన చేరడానికి చంద్రబాబే కేవీపీతో ఇలా మాట్లాడించారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. చంద్రబాబు అవకాశవాదం గురించి కేవీపీకి తెలియపోవచ్చుగానీ…దేశంలోని ప్రతిపార్టీ అగ్ర నాయకులకూ గత ఎన్నికలతో బాగా తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో కేవీపీ ‘చక్కెర పూత’ ప్రయత్నాలు వృథానే.