కాస్ట్యూమ్స్ కృష్ణ.. నిన్నటితరానికి పరిచయం అక్కర్లేని పేరు. విలక్షణమైన నటుడిగా మాత్రమే ఆయన చాలామందికి తెలుసు. కానీ అంతకుమించి ఆయన ఇండస్ట్రీలో ఓ ప్రొఫెషనల్. పైగా నిర్మాత కూడా. అయితే ఈ నిర్మాత అనే ట్యాగ్ లైనే ఆయన కొంప ముంచిందని అంటుంటారు చాలామంది.
పెళ్లిపందిరి సినిమా కాస్ట్యూమ్స్ కృష్ణ జీవితాన్ని తలకిందులు చేసింది. అప్పటివరకు అనుభవించిన మంచి జీవితాన్ని దూరం చేసింది. ఆర్థికంగా కుంగదీసింది. చివరికి ఇదే సినిమాతో ఆయన ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.
ఇంతకీ ఏం జరిగింది..
జగపతిబాబు హీరోగా పెళ్లి పందిరి సినిమాను నిర్మించారు కాస్ట్యూమ్స్ కృష్ణ. అయితే ఆ సినిమాకు పబ్లిసిటీ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే తన సినిమా ఆడుతుందని ఆయన నమ్మారు. అయితే కాస్ట్యూమ్స్ కృష్ణకు తెలిసిన కొంతమంది మనుషులు మాత్రం ఈ నిర్ణయంతో విభేదించారు. కావాలంటే పబ్లిసిటీకి తాము 2 లక్షల రూపాయలిస్తామని, తమకు సంతకం పెడితే చాలని నమ్మించారు. ఈ ప్రతిపాదనకు జగపతిబాబు కూడా ఓకే చెప్పారట.
అలా అంతా నమ్మబలకడంతో.. కాస్ట్యూమ్ కృష్ణ 2 డాక్యుమెంట్లలో 2 సంతకాలు పెట్టారు. అందులో ఏముందనేది కూడా ఆయన చదవలేదు. అదే ఆయన పాలిట శాపం అయింది. మొదటి డాక్యుమెంట్ లో 2 లక్షలు అప్పు ఇచ్చినట్టు ఉంది. అంతవరకు బాగానే ఉంది. రెండో డాక్యుమెంట్ లో మాత్రం పెళ్లిపందిరి నెగెటివ్ రైట్స్ అన్నీ బయ్యర్ల పరమైనట్టు ఉంది. దానిపై కాస్ట్యూమ్స్ కృష్ణ సంతకం ఉంది.
ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కాస్ట్యూమ్స్ కృష్ణ, తెలిసిన వాళ్లే తనను నమ్మకద్రోహం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే బాధలో ఆయన సినీరంగాన్ని వదిలేశారు. ఆస్తులు అమ్మి తీసిన పెళ్లిపందిరి సినిమా తనకు దక్కకపోవడంతో, చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అయ్యారు. పరిశ్రమకు దూరంగా శేష జీవితాన్ని అక్కడే గడిపేశారు.
కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి నటుడిగా..
కాస్ట్యూమ్ డిజైనర్ గా కృష్ణకు తిరుగులేని పేరుంది. రామానాయుడు స్టుడియోస్ లో పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్ ఆయన. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి ఎంతోమంది హీరోలకు ఆయనే కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆ తర్వాత భారత్ బంద్ సినిమాతో నటుడిగా మారారు. తన విలక్షణమైన గొంతుతో ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్ర వేశారు.