ఏ ఊరికెళితే ఆ ఊరు మాట మాట్లాడటంలో ఇంత వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడని చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు ఆయన్ను జనసేనాని పవన్‌కల్యాణ్ మించిపోయాడనే వాదన వినిపిస్తోంది. రాజధానిపై ఆయన వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను నిదర్శనంగా చూపుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అయ్యా పవన్ మాట మార్చడంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అని నెటిజన్లు అంటున్నారు. పలు సందర్భాల్లో ఆయనేం మాట్లాడారంటే…
‘మొత్తం పెట్టుబడి అంతా అమరావతిలోనే పెట్టేసి, మొత్తం శ్రమశక్తినంతా అక్కడే పెట్టేస్తున్నారు. అమరావతికి నేను ఒక పార్వతిపట్నం నుంచో లేదంటే ఆముదాలవలస నుంచో వెళ్తాను. నేనొక సామాన్యున్ని. అమరావతిలో నాకు స్థలం కావాలంలే ఎలా? గవర్నమెంట్ 33 వేల ఎకరాలో, లక్ష ఎకరాలో పెట్టుకొంది. ఎట్లా ఇస్తారు మీరు. నేను ఇక్కడ ఉండాలి, పనిచేస్తాను. నాకు కనీసం ఇల్లు కట్టుకునే అవసరం ఉంటుంది కదా. హైదరాబాద్ నగరం సహజంగా ఏర్పడింది. అలాంటిది ఈ ప్రభుత్వం తీసుకునే పాలసీల్లో నాకేం కనిపిస్తోందంటే ఆంధ్రప్రదేశ్ మరోసారి మూడు ముక్కలయ్యే పరిస్థితి బలంగా ఉంది’
‘మనది ఇన్‌క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఎక్స్‌క్లూజివ్‌గా కొద్ది మంది కోసం మాత్రమే ఉంది తప్ప, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అఫిలేటెడ్ క్యాపిటల్‌గా ఉంది. అంతే తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే ఇక్కడికి వచ్చి ఎలా స్థిరపడతారు? రాయలసీమ ప్రాంతవాసులు ఇక్కడ ఎలా స్థిరపడతారు. ప్రతి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకుంటే ఏమైనా చర్యలు తీసుకున్నారా? 33 వేల ఎకరాల్లో ఒక్కో ప్రాంతానికి లేదా జిల్లాకి కానీ 2వేల ఎకరాల చొప్పున ఇయర్ మార్చ్ చేశారా? ప్రతి అంశంలోనూ చంద్రబాబు పార్టీ బలమైన వైఫల్యాన్ని చూపుతూ వచ్చింది’
‘కర్నూల్ మన రాజధాని. ఈ రోజు మనకు అమరావతి రాజధాని ఏమో కానీ, నా మనసుకు కర్నూలే రాజధాని. నేను మీకు మాట ఇస్తున్నాను. జనసేన ప్రభుత్వం వస్తే అమరావతికి మించిన రాజధానిగా కర్నూల్‌ని నేను చేసిపెడతాను. అందరికీ ఉంది కదా బాధ. ఇంత మంది వ్యక్తులు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులయ్యారు. ఎవరూ రాయలసీమకు ఏమీ చేయలేదు. నేను చెబుతున్నాను మీకు. మీలో ఒకడిగా, మీ అన్నగా రాయలసీమలో పుట్టిన వాళ్లు ఎంత చేశారో నాకు తెలియదు కానీ, కర్నూల్‌కు, రాయలసీమకు పూర్వ వైభవం తెస్తాను’
ప్రస్తుతానికి వద్దాం. మంగళవారం అమరావతి రైతులు పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో పవన్ ఏమన్నారంటే…
‘జగన్ 30 రాజధానులు పెట్టినా రాజధానిని తిరిగి అమరావతికే తీసుకొస్తాం. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తాయి. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన రాజధానిని.. ఏ ప్రాంతం బాధపడకుండా.. తిరిగి ఇక్కడికే తీసుకొస్తాం. 151 ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపీకి భవిష్యత్‌లో ఒక్క ఎమ్మెల్యే వస్తే గొప్పనే పరిస్థితి వచ్చేలా జనం తీర్పు ఇవ్వాలి’ అని పవన్ అన్నాడు.
రాజధానిపై పవన్‌కే స్పష్టత లేదు. తనతో మాట్లాడిన వారిని సంతృప్తిపరిచే మాటలే తప్ప, పరిష్కార మార్గాన్ని చూపడం ఆయనకు చేతకావడం లేదు. పైన పేర్కొన్న అంశాలే పవన్ ఎంత గందరగోళానికి గురవుతున్నడో చెప్పేందుకు నిదర్శనం.