ఐటీ విచారణను ఎదుర్కొంటున్న నటి రష్మిక విషయంలో కన్నడ మీడియా సంచలన కథనాలను ఇస్తూ ఉంది. మొదటి నుంచి కన్నడ మీడియాకు రష్మిక అంటే చాలా ప్రేమ! ఆ ప్రేమను రకరకాలుగా వ్యక్తం చేస్తూ వచ్చింది. కన్నడ సినిమా కిరిక్ పార్టీతో గుర్తింపుకు నోచుకున్నప్పటి నుంచి ఆమె మీడియాకు మంచి వార్తలు ఇచ్చే సెలబ్రిటీగా మారింది. ప్రత్యేకించి కన్నడ మీడియాకు.
ఆ తర్వాత తెలుగు సినిమా గీతగోవిందం లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సన్నివేశంలో నటించడంతో కన్నడ మీడియాలో రష్మిక పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఆమె నిశ్చితార్థం రద్దు గురించి ముందుగా మీడియా ప్రచారం మొదలుపెట్టింది, తర్వాత ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది. ఇలాంటి క్రమంలో రష్మికను తిడుతూనో, పొగుడుతూనో ఏదో కంగా వార్తలు అయితే కొనసాగుతూ ఉన్నాయి.
ఈ క్రమంలో ఐటీ రైడ్స్ తో రష్మిక వార్తల్లోకి ఎక్కింది. దీంతో కన్నడ మీడియా చెలరేగిపోతూ ఉంది. సంచలన నంబర్లను ప్రకటిస్తూ ఉంది. రష్మిక ఆస్తుల విలువ 250 కోట్ల రూపాయలు అంటూ కన్నడ మీడియా ప్రకటిస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆ ఆస్తులన్నీ ఐటీ స్కానర్ లో ఉన్నాయని చెబుతోంది శాండల్ వుడ్ మీడియా.
రష్మిక వయసు 23. ఆమె చేసిన సినిమాలు గట్టిగా అరడజను. ఇలా ఎలా చూసినా 250 కోట్ల రూపాయల ఆస్తులకు అవకాశమే కనిపించడం లేదు. అయితే రష్మిక విషయంలో ఏదో ఒక సంచలన కథనాలను రాయడం కన్నడ మీడియాకు అలవాటే. అందులో భాగంగా ఆమె ఆస్తులు 250 కోట్లు అంటూ అక్కడి మీడియా హడావుడి చేస్తూ ఉంది. మరి అసలు కథ ఏమిటో!