తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా వ్యూహం రచించారు. రాజకీయ ఎత్తుగడల్లో తండ్రికి తగ్గ తనయురాలనిపించేలా ఆమె తాజాగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటిని ఏకం చేసేందుకు అదిరిపోయే ప్రయత్నం మొదలు పెట్టారు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు షర్మిల స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.
నిరుద్యోగ సమస్యలపై కలిసిపోరాడదామని వాళ్లిద్దరిని షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. అలాగే ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని ఆ ఇద్దరు నేతల ఎదుట ప్రతిపాదించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని షర్మిల కోరారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయకపోతే ఎవర్నీ బతకనివ్వరనే బండి సంజయ్, రేవంత్‌లతో తన అభిప్రాయాన్ని షర్మిల కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
బండి సంజయ్ స్పందిస్తూ …షర్మిల ప్రతిపాదనలను స్వాగతించారు. త్వరలో సమావేశం అవుదామని షర్మిలతో ఆయన అన్నారు. అలాగే రేవంత్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని షర్మిలకు రేవంత్ హామీ ఇచ్చారు. ఇద్దరు ప్రతిపక్ష నేతలకు షర్మిల ఫోన్ చేసి మాట్లాడ్డం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.
కేసీఆర్‌పై ప్రతిపక్షాలన్నీ విడివిడిగా పోరాటం చేయడం వల్ల ఆయన వ్యతిరేక ఓట్లు చీలి… చివరికి బీఆర్ఎస్ రాజకీయంగా లాభపడుతుందనే అభిప్రాయం వుంది. దీంతో కేసీఆర్‌ను అధికారం నుంచి గద్దె దింపాలంటే సిద్ధాంతపరంగా బద్ధ వ్యతిరేకమైన కాంగ్రెస్, బీజేపీలను సైతం కలుపుకుని ఒక కూటమిగా ఏర్పరచాలనే షర్మిల ప్రయత్నం ఊహించని పరిణామం.
షర్మిల ప్రతిపాదన రాజకీయంగా సరికొత్త చర్చకు దారి తీసింది. అసలు ఇది సాధ్యమా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఒకవేళ ప్రతిపక్షాలన్నీ పోరాటాల వరకే ఏకమవుతాయా? లేక ఎన్నికల్లో అనూహ్యమైన పొత్తులుంటాయా? అనే అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.