బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని తన్నాలని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా కోరాడు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ చివరిలో జగన్ ఈ సంచలన కామెంట్స్ చేశాడు. వివిధ అంశాలపై జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇదే సందర్భంలో బీజేపీ మ్యానిఫెస్టోను ప్రదర్శించారు.
బీజేపీ మ్యానిఫెస్టోను సీఎం జగన్ చదువుతూ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏపీ శాఖ తన ఎన్నికల ప్రణాళికలో కర్నూల్‌లో హైకోర్టును పెడతామని స్పష్టం చేసిందన్నాడు. అలాగే అమరావతిలో టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కొందని, తాము అధికారంలోకి వస్తే వాటిని తిరిగి రైతులకు ఇస్తామని పేర్కొన్న విషయాన్ని చదివి వినిపించాడు. చంద్రబాబు దాన్నీ వక్రీకరించి మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.
సుజనాచౌదరి అనే తెలుగు బీజేపీ సభ్యుడు ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నారో లేక తెలియక మాట్లాడుతున్నారో…ఇలాంటి వ్యక్తుల్ని తన్ని బయటకు పంపాలని బీజేపీ నేతలను కోరుతున్నానన్నాడు. రాజధాని అంశం వివాదమైనప్పటి నుంచి సుజనాచౌదరి రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. రాజధానిని అంగుళం కూడా కదల్చలేరని, కేంద్రం అన్నీ చూస్తోందని, చూస్తూ ఊరుకోదని సుజనా పదేపదే జగన్ సర్కార్‌ను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. బహుశా ఇవన్నీ జగన్ మనసులో ఉండడం వల్లే తన్ని బయటికి పంపాలనేంత తీవ్రస్థాయిలో మాట్లాడారని అర్థం చేసుకోవచ్చు.