ఏపీకి మూడు రాజధానులను నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హై పవర్ కమిటీ నివేదికను ఆమోదిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఏపీకి మూడు రాజధానులు ఉండబోతూ ఉన్నాయి. అలాగే నాలుగు ప్రాంతీయ కమిషనరేట్ల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఏపీకి శాసన రాజధానిగా అమరావతి, జ్యూడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు, పాలనా రాజధానిగా వైజాగ్ లు ఉండబోతూ ఉన్నాయి. ఈ మేరకు కొన్నాళ్ల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన మేరకు హై పవర్ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఆ కమిటీ తన సుదీర్ఘ నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చింది. దానిపై కేబినెట్లో చర్చింది ఆమోద ముద్ర వేసింది ప్రభుత్వం.
మూడు రాజధానుల ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదన ఆమోదానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరుస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీలో ఉన్న బలం ప్రకారం.. ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే.
అలాగే ఏపీ కేబినెట్ భేటీలో మరి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అమరావతి ప్రాంత రైతులకు ప్రభుత్వం ఇచ్చే చెల్లింపులను కూడా పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే జిల్లాల సంఖ్యను 25కు చేయడం మీద కూడా కసరత్తు ప్రారంభించే చర్చను కూడా కేబినెట్లో చేపట్టినట్టుగా సమాచారం.
సీఆర్డీఏను రద్దు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ స్థానంలో అమరావతి అభివృద్ధికి మరో మండలిని ఏర్పాటు చేసింది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. సమావేశాల్లో ఈ అంశాలన్నీ కూలంకషంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.