చంద్రబాబుకు ప్రాంతీయ పార్టీల మద్దతు లేదు.. ఎందుకు?!

మొన్న ఓ జాతీయ టివి ఛానల్‌ ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఒక మాట అడిగారు. మీ నాన్న జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలను ఏకం చేసి అలయెన్స్‌లు…

మొన్న ఓ జాతీయ టివి ఛానల్‌ ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఒక మాట అడిగారు. మీ నాన్న జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలను ఏకం చేసి అలయెన్స్‌లు సృష్టించడంలో మాస్టర్‌ కదా…అలాంటి వ్యక్తి అరెస్టయి జైళ్లో వుంటే ప్రాంతీయ పార్టీల నేతల నుంచి మద్దతు లభించడం లేదు…కారణం ఏమిటి? అని సూటిగా అడిగారు. దానికి లోకేష్‌ చాలా మద్దతు ప్రకటించారంటూ ఏదో సమాధానం చెప్పారుగానీ….ఆ యాంకర్‌ అడిగిన ప్రశ్న ఆలోచించదగినదే. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన ప్రశ్నే. పీకల్లోతు కష్టాల్లో వున్న చంద్రబాబు నాయుడిని ఇటు ఎన్‌డిఏగానీ, అటు ఇండియా కూటమి గానీ పట్టించుకోలేదు.

టివి యాంకర్‌ చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్ ఫ్రంట్‌ల‌లో చంద్రబాబు పాత్ర వుంది. ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, కాంగ్రెస్‌, బిజెపి యేతర పార్టీలను ఏకంచేసి కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో చాలామంది నాయకులతో పాటు చంద్రబాబు కూడా క్రియాశీలకంగా పని చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో చంద్రబాబుకు మంచి సంబంధాలు వున్నాయి. దేవేగౌడ, విపి సింగ్‌, చంద్రశేఖర్‌, హరికిషన్‌ సింగ్‌ సూర్జీత్‌, సోమనాథ్‌ ఛటర్జీ, కరుణానిధి, జయలలిత, లాలూప్రసాద్‌ యాదవ్‌, నవీన్‌ పట్నాయక్‌, ములాయం సింగ్‌, మమతా బెనర్జీ, ఫ‌రూక్ అబ్దుల్లా, మాయావతి ఇలాంటి ఎందరో ప్రాంతీయ పార్టీ నాయకులతో చంద్రబాబు సత్‌ సంబంధాలు కలిగి వుండేవారు.

కాలక్రమంలో చంద్రబాబు అవకాశవాద రాజకీయాలతో అందరికీ దూరమయ్యారు. నిబద్ధత లేని రాజకీయాలతో విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడిగా జాతీయ స్థాయిలో ముద్రపడ్డారు. అవసరం కొద్దీ, సిద్ధాంతాలతో పని లేకుండా రాత్రికి రాత్రి థర్డ్‌ ఫ్రంట్‌ / కాంగ్రెస్‌ / బిజెపిలలో ఒకచోటి నుంచి ఇంకోచోటికి మకాం మార్చడంతో ఆయన విశ్వసనీయత కోల్పోతూ వచ్చారు. తాజా పరిణామాలనే చూస్తే 2014 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు…2019 ఎన్నికలోచ్చే సరికి తన ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో జతకట్టారు. కాంగ్రెస్‌తో కలవడం చారిత్రక అవసరంగా చెప్పారు. రాహుల్‌ గాంధీని కాబోయే యువ ప్రధానిగా అభివర్ణించారు. బిజెపిని, మోడీని నోటికొచ్చినట్లు తిట్టిపోశారు. 2019 ఎన్నికల్లో బిజెపి గెలిచే సరికి కాంగ్రెస్‌ను విడిచిపెట్టేశారు.

ఈ మధ్యనే ఒక కోర్టు కేసులో తీర్పును అడ్డుపెట్టుకుని రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసినా….చంద్రబాబు నాయుడు నోరు తెరచి మాట్లాడలేదు. కనీసం ఖండిస్తూ పత్రికా ప్రకటన ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి టిడిపి తరపున ప్రచారం చేశారు. అయితే…ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఫరూక్‌ అబ్దుల్లా సహా కాశ్మీరీ నేతలను ఆరు నెలలకుపైగా కేంద్ర ప్రభుత్వం గృహ నిర్బింధంలో వుంచింది. అయినా చంద్రబాబు నాయుడు మాట మాత్రంగానైనా ఖండించ‌లేదు. 

కొందరు జాతీయ నాయకులు కాశ్మీర్‌ వెళ్లి అక్కడి నాయకులకు సంఫీుభావం చెప్పివచ్చినా చంద్రబాబు నాయుడు కనీసం పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదు. దీనిపైన ఇటీవల ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కేంద్ర ప్రభుత్వం ముప్పుతిప్పులు పెడుతున్నది. అయినా ఏనాడూ వాళ్లకు సంఫీుభావం ప్రకటించలేదు చంద్రబాబు నాయుడు.

బిజెపిని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఐ.ఎన్‌.డి.ఏ. కూటమిగా ఏర్పడి క్రియాశీలంగా పనిచేస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా చంద్రబాబు నిజాయితీగా నిర్ణయం తీసుకోలేదు. బిజెపి పిలిస్తే ఎన్‌డిఏలో చేరాలని  ఉవ్విళ్లూరుతున్నారు. ఆది కుదరకుంటే ఇండియా కూటమిలో చేరడానికి వీలుగా ఇండియా కూటమి ఏర్పాటుపై మౌనం వహిస్తున్నారు. దీంతో ఇటు ఎన్‌డిఏ కూటమిలోని పార్టీలుగానీ, అటు ఇండియా కూటమిలోని పార్టీలుగానీ చంద్రబాబును విశ్వసించడం లేదు.

టివి యాంకర్‌ చెప్పినట్లు దేశమంతా వెతికినా చంద్రబాబుకు స్నేహితులు కనిపించడం లేదు. చంద్రబాబు అరెస్టును ఒకరిద్దరు ప్రాంతీయ పార్టీల నాయకులు ఖండించినా…అది చంద్రబాబు మీద అభిమానంతో కాదు. చంద్రబాబు అరెస్టు వెనుక బిజెపి వుందన్న భావనతో మాత్రమే.

ఒకప్పుడు చంద్రబాబు థర్డ్‌ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తారన్న ప్రచారం జరిగింది. వాస్తవంగా అటువంటి అవకాశం కూడా ఆయనకు దక్కింది. అయితే…ఆయన అవకాశవాద రాజకీయాల ఫలితంగా ఇప్పుడు ఒక పార్టీ కూడా బాబుకు దగ్గరగా లేదు. ఇంకా చెప్పాలంటే ఆయనకు మిత్రులైన వారికి ముఖం చూపించలేని దుస్థితిలో వున్నారు.

– ఆదిమూలం శేఖర్‌, సీనియర్‌ జర్నలిస్టు