చాలా దశాబ్దాల కాలంగా సాధారణ జనాలకు ఓ అనుమానం. వ్యాపారాలు చేసే ఈ డబ్బున్న మారాజులు కోట్లకు కోట్లకు ఎలా పడగలెత్తారా? అన్నదే ఆ అనుమానం.
ఇదంతా వారు చేసే వ్యాపారాల వల్లేనా? అసలు వేలు, వందల కోట్లతో వ్యాపారం కింద నుంచి ప్రారంభించిన వారికి ఎలా వచ్చింది? ఇదంతా ఇన్ స్పయిరింగ్ స్టోరీనా? వేరే ఇన్ సైడ్ స్టోరీ ఏదన్నా వుందా? ఇన్నాళ్లు ఈ ప్రశ్నలకు అంతగా సమాధానం తెలియలేదు.
కానీ మోడీ ప్రభుత్వం వచ్చి, బ్యాంకుల అడ్డగోలు రుణమాఫీలకు బ్రేక్ వేసిన తరువాత అర్థం అయింది. ఇన్నాళ్లూ ప్రజల సొమ్మును బ్యాంకు రుణాల రూపంలో తీసుకుని, వాటిని ఎగ్గొట్టి, తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి వాటిని మాఫీ చేయించి, హ్యాపీగా ఈజీగా మనీ సంపాదించుకుంటున్నారని.
ఇలాంటి బాకీ ఎగ్గొట్టే బాపతు జనాలకు రాజకీయాలు, కోర్టులే అండ. రాజకీయలు చేయడం, పార్టీలు మారుతూ తమ మీదకు ఏ ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు రాకుండా కాపాడుకోవడం. పొరపాటున వచ్చినా చట్టంలో లొసుగులు, అవకాశాలు వాడుకుని, కోర్టులను ఆశ్రయించి ఊరట పొందడం.
ఏళ్లకు ఏళ్లు కోర్టుల్లో కేసులను తెగలాగి, తమ అనుకూల ప్రభుత్వం రాగానే మళ్లీ మాఫీ చేయించుకోవడం. ఇదే కార్యక్రమం. ఇప్పటికే ఇలాంటి వ్యవహారాలు ఎవరెవరు చేసారో జనాలకు అర్థం అయింది.
తెలుగుదేశంలో వుంటూ, ఈ వ్యవహారాల కారణంగా భాజపాలో ఆశ్రయం పొందిన వారు వున్నారు. రాజకీయాలు పనికిరాక విదేశాలకు చెక్కేసిన వారు వున్నారు. ఆస్తులు అమ్మి కడతామని అంటున్న అంబానీ లాంటి వారూ వున్నారు.
లేటెస్ట్ గా ఈ జాబితాలో అంబిక కృష్ణ కూడా వున్నారని జనాలకు తెలిసిపోయింది. భగవంతునికి భక్తునికి అనుసంధానం తమ అగర్ బత్తీ అంటూ, తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీ ఓడిపోగానే భాజపాలోకి జంప్ అన్నారు అంబికా కృష్ణ.
ఆయన కూడా బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం, వాటిని దారి మళ్లీంచి ఆస్తులు పెంచుకోవడం లాంటివి చేసారని ఇప్పుడు వార్తలు గుప్పుమంటున్నాయి. పనిలో పనిగా సిబిఐ రంగంలోకి దిగింది. షరా మామూలుగా సోదాలు చేసింది.
అక్కడి వరకు మాత్రమే వార్తలు వస్తాయి. ఆ తరువాత ఏం జరిగింది? జరుగుతుంది? అన్నది ఎవరికీ తెలియదు. అది రఘురామ కృష్ణం రాజు అయినా, అంబికా కృష్ణ అయినా. కానీ వీళ్లంతా మాత్రం మీడియా ముందు కూర్చుని నిత్యం సుద్దులు చెబుతారు. ఖరీదైన కార్లలో తిరుగుతారు.
బాకీ వసూళ్లకు పాపం బ్యాంకు అధికారులు వాళ్ల ఇళ్ల ముందు, ఆఫీసుల ముందు పడిగాపులు పడుతుంటారు. డబ్బు సంపాదనకు వ్యాపారాలు చేయాలంటే కష్టం. మార్కెటింగ్, పోటీ, లాభం ఇన్ని వుంటాయి. అదే వ్యాపారం పేరు చెప్పి రుణాలు తీసుకుని ఎగ్గొట్టేయడం సులువు. ఎందుకంటే అలాంటి వాళ్లకే ఈ దేశంలో రాజకీయ పార్టీలు అండగా వుండేది.