టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీలు…?

బీజేపీకి లోక్ సభలో ఎంపీలు లేరు. రాజ్యసభలో మాత్రం ఉన్నారు. వారిలో ముగ్గురు టీడీపీ నుంచి బీజేపీలోకి రెండున్నరేళ్ల క్రితం చేరిన వారు. ఇక యూపీ నుంచి బీజేపీ తరఫున గెలిచిన తెలుగు వారు…

బీజేపీకి లోక్ సభలో ఎంపీలు లేరు. రాజ్యసభలో మాత్రం ఉన్నారు. వారిలో ముగ్గురు టీడీపీ నుంచి బీజేపీలోకి రెండున్నరేళ్ల క్రితం చేరిన వారు. ఇక యూపీ నుంచి బీజేపీ తరఫున గెలిచిన తెలుగు వారు జీవీఎల్ నరసింహారావు.

వీరంతా ఏపీ బీజేపీకి ఇపుడు బలం. వారితోనే కధ నడిపించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది. అదే సమయంలో కీలకమైన ప్రాంతాలను ఎంపిక చేసి మరీ వారిని అక్కడికి పంపుతోంది.

ఇక కేవలం పదిహేను రోజుల వ్యవధిలో ముగ్గురు బీజేపీ ఎంపీలు విశాఖ టూర్లు వేయడం మాత్రం అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. గత నెల చివరలో ఎంపీ సుజనా చౌదరి విశాఖ వచ్చారు. సిటీలో జరిగిన వాజ్ పేయ్ జయంతి  కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ సర్కార్ మీద సుజనా పెద్ద ఎత్తున నిప్పులు చెరిగారు.

ఇక ఈ మధ్యనే జీవీఎల్ నరసింహరావు విశాఖలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆయన కూడా అదే బీజేపీని పొగుడుతూ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఇపుడు మూడవ ఎంపీగా సీఎం రమేష్ వంతు వచ్చింది. ఆయన విశాఖలో బీజేపీ  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక వైసీపీ మీద విమర్శల జడివాన కురిపించారు. 

జగన్ సర్కార్ పోలీసులకు పార్టీ కండువాలు కప్పేసిందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేయడం విశేషం. మొత్తానికి విశాఖ మీద బీజేపీ దృష్టి పెట్టిందా లేక ఎంపీలు ఇక్కడ రాజకీయం చేయడం సేఫెస్ట్ అనుకుంటున్నారా. మొత్తానికి వలసపక్షులకు నిలయం అయిన విశాఖకే బీజేపీ ఎంపీలు ఎంచుకోవడం మాత్రం చర్చకు దారి తీస్తోంది.