సినిమా అనౌన్స్ చేస్తూనే డబ్బులు చేతిలో పడాలి అంటే శాటిలైట్, డిజిటల్ లాంటివి అమ్మేసుకోవడం ఒక మార్గం. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. అన్ని బ్యానర్లకు సాధ్యం కాదు.
క్రేజీ ప్రాజెక్టులకు, పెద్ద బ్యానర్లకే ఇది సాధ్యం. అయితే అలా అని, ఇలా స్టార్ట్ చేసి, అలా అమ్మేసిన తరువాత, చటుక్కున ఆ ప్రాజెక్టు మూలన పడిపోతే సమస్యే. ఆ బాకీని మరో సినిమతో తీర్చాల్సి వుంటుంది.
మైత్రీ మూవీస్ కు ఇలాంటి బాకీలు రెండు వున్నాయని తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో రవితేజతో ఓ సినిమా అనుకున్నారు. దానికి ఓ ఫైట్ కూడా చిత్రీకరించినట్లు బోగట్టా. అలాగే మరో యంగ్ హీరో-కొత్త డైరక్టర్ కాంబినేషన్ లో భారీ సినిమా అనుకున్నారు. రెండు మూడు కోట్లు ఖర్చు చేసాక ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్నారు.
ఈ రెండు సినిమాల డిజిటల్ రైట్స్ ముందే ఇచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ కంటెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మరో రెండు సినిమాలు స్టార్ట్ చేసారు. బన్నీ-సుకుమార్ పుష్ప, పరుశురామ్-మహేష్ బాబు సర్కారువారి పాట.
ఈ రెండు సినిమాల డిజిటల్ రైట్స్ సెటిల్ కావాలంటే పాత లెక్కలు కూడా లెక్కలోకి వస్తాయి. పైగా మహేష్ సినిమాకు నాన్ థియేటర్ అంటే హీరో రెమ్యూనిరేషన్ కింద వెళ్తాయి. పైగా ఆ సినిమాకు 14 రీల్స్ భాగస్వామ్యం కూడా వుంది.
అందువల్ల డిజిటల్ రైట్స్ రేటు తేలాలి. పాత లెక్కలు చూడాలి. కొత్త అగ్రిమెంట్ లు కావాలి. ఆ మేరకు మొత్తాలు లెక్కలు చూసుకొవాలి. ఇక శాటిలైట్ సంగతికి వస్తే, పుష్ప-సర్కారు వారి పాట సినిమాల ప్రపోజల్ స్టార్ గ్రూపు నకు సబ్ మిట్ చేసారని బోగట్టా. ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.