కొత్తగా నడక నేర్చుకున్న పిల్లల్ని పట్టుకోవడం పెద్దోళ్లకు తలకు మించిన భారం. ప్రస్తుతం నారా లోకేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ట్విట్టర్ ప్రపంచం నుంచి ఇప్పుడిప్పుడే ఆయన బైటకు తొంగి చూస్తున్నారు.
వరద పరామర్శ యాత్రల పేరుతో రైతుల దగ్గరకు వెళ్లి తన ప్రతిభా పాఠవాలు చూపిస్తున్నారు. వేర్లు పైకి, పైర్లు కిందకి పట్టుకుని కామెడీ చేస్తున్నారు. ట్రాక్టర్ ని కాల్వలోకి తోలి తోటి నాయకుల ప్రాణాలని రిస్క్ లోకి నెడుతున్నారు. యాత్ర తర్వాత ఓ ప్రెస్ మీటి పెట్టి సీఎం జగన్ పై తనకున్న అక్కసునంతా వెళ్లగక్కుతున్నారు.
అక్కడితో చినబాబు యాత్రకు కాస్త విరామం ఇస్తారేమో అనుకున్నారంతా. కానీ లోకేష్ మాత్రం వెనక్కి తగ్గడంలేదట. జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారట. కొడుకు ఉత్సాహం చూసి చంద్రబాబు కూడా దానికి అనుగుణంగానే ఓ పథక రచన చేశారని తెలుస్తోంది. కొడుక్కి అలవాటు తప్పిపోతుందేమోననే అనుమానం కూడా ఉండటంతో చంద్రబాబు వెంటనే టూర్ షెడ్యూల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
వరద బాధితులు అయిపోయారు కాబట్టి.. ఈసారి అమరావతి ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు లోకేష్ ని రంగంలోకి దింపాలని చూస్తున్నారు చంద్రబాబు.
గతంలో తాను జోలెపట్టి మొదలు పెట్టిన ఉద్యమాన్ని ఇప్పుడు కొడుకుతో కంటిన్యూ చేయించబోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించి అమరావతికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు.
అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది, దానితోపాటు ఓ రాజకీయ ఎత్తుగడ కూడా ఉంది. ఉత్తరాంధ్ర వెళ్లి, విశాఖను కాదని జై అమరావతి అంటే అక్కడ జనం ఎలా రియాక్ట్ అవుతారోనన్న సందేహం ఓవైపు ఉంది.
పోనీ జనం తిరగబడితే.. దాన్ని ప్రభుత్వ దాడిగా పరిగణిస్తూ సింపతీ క్రియేట్ చేసుకునే అవకాశమూ ఉంది. దీంతో సింపతీ కోసమే లోకేష్, చంద్రబాబు ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్టు అర్థమవుతోంది. అల్లర్లు జరిగితే మరోసారి విశాఖలాంటి ప్రశాంత నగరంలో కడప బ్యాచ్ చిచ్చు పెడుతోందనే నింద కూడా వేసేయొచ్చు.
అందుకే చినబాబు యాత్ర పార్ట్ -2 ఉత్తరాంధ్ర నుంచి మొదలవుతుందని అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర రిజల్ట్ చూసుకుని రాయలసీమలో యాత్ర కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారట.