టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం కాదని, ఆయన కాంగ్రెస్ పక్షమని అన్నారట బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీలో ద్వితీయ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అని సోము తేల్చి చెప్పారు.
బీజేపీ కార్యక్రమంలో ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు చాలా మంది తమ పార్టీ వైపు చూస్తునట్టుగా చెప్పుకున్నారు. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే తన పార్టీ వాళ్లను స్వయంగా చంద్రబాబు నాయుడే కొంతమందిని బీజేపీలోకి ఆల్రెడీ పంపించేశారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన నెలన్నర రోజుల్లోనే బీజేపీలో కొంతమంది చంద్రబాబు మనుషులు తిష్ట వేశారు. బీజేపీని ఎదగకుండా చేయడంలో వారు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. వారిలో కొందరిని సోము వీర్రాజు సస్పెండ్ చేసే యత్నంలో ఉన్నా, మరి కొందరు మాత్రం సోము సస్పెన్షన్లకు అందని స్థాయిలో ఉన్నారు!
ఇక కొంతలో కొంత బీజేపీకి మేలేమిటంటే చంద్రబాబును సోము వీర్రాజు ఇంకా కాంగ్రెస్ మనిషిగానే చూస్తూ ఉండటం! చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఏడాది గడిచిపోయింది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు తనదైన హ్యండును ఇచ్చారు! ఎన్నికల ముందు మోడీని తిడుతూ, కాంగ్రెస్ ను నెత్తికెత్తుకున్న చంద్రబాబు నాయుడు, ఎన్నికల ఫలితాల తీరుతో కాంగ్రెస్ కాడిని పడేశారు! మళ్లీ బీజేపీ ప్రాపకం కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు!
బీజేపీ నేతలెవరికైనా కాళ్లో ముళ్లు గుచ్చుకుంటే చంద్రబాబు నాయుడు విలవిల్లాడిపోతూ ఉన్నారు. ఇలా కమలం పార్టీ కాళ్ల ముందు సాగిలాపడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇది జనాలకు అర్థం అవుతోంది. అయితే సోము వీర్రాజు మాత్రం చంద్రబాబును ఇంకా కాంగ్రెస్ మనిషిగానే చూస్తూ ఉన్నారు. ఇది బీజేపీకి మంచిదే.
సొంతంగా ఎదగాలనే ఆసక్తి ఉంటే, చంద్రబాబును బీజేపీ దగ్గరకు చేరనీయకపోవడం ఆ పార్టీకే మంచిదే. చంద్రబాబుతో పెట్టుకున్న స్నేహం అనుకున్న ఏ పార్టీ అయినా అంతకంతకు కూరుకుపోవడమే కానీ ఎదిగిన దాఖలాలు లేవు.
ఆ విషయాన్ని బీజేపీ ఇన్ని దశాబ్దాల్లో గ్రహించీ, గ్రహించనట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు మాత్రం చంద్రబాబును దగ్గరకు రానిచ్చేది లేదంటోంది. అయితే చంద్రబాబు మాత్రం సాగిలా పడుతూనే ఉన్నారు. చంద్రబాబు తన టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. వాటి ముందు బీజేపీ నిగ్రహమేస్థాయిదో!