కళ్యాణ్ దిలీప్ సుంకర. వివిధ విషయాల మీద ముఖ్యంగా వర్తమాన రాజకీయ వ్యవహారాల మీద తనదైన శైలిలో నిత్యం వీడియో కామెంట్ చేసే అనలిస్ట్. ప్రధానంగా కాపు సామాజిక వర్గం మద్దతు దారు. జనసేన అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా అభిమానం ఎంతో కొంత వుంది.
ఇప్పుడు ఆయన మరో ఆరు నెలల పాటు రాజకీయ విశ్లేషణలు చేయనని ప్రకటించారు. ఈ మేరకు ఓ లైవ్ వీడియో చేసారు. తెలుగుదేశం-జనసేన పొత్తు కుదిరిన తరువాత పడిన గట్టి వికెట్ ఇది. ఎందుకంటే సోషల్ మీడియాలో జనసేనకు, పవన్ కు మద్దతు చాలా గట్టిగా లభిస్తుంది దిలీప్ సుంకర నుంచి. అలాంటి దిలీప్ సుంకర ఇలాంటి క్రూషియల్ టైమ్ లో పక్కకు తప్పుకోవడం అంటే జనసేన-తెలుగుదేశం పొత్తుకు మద్దతు సంగతి అలా వుంచి జనసేన పార్టీ తరపున సరైన మద్దతుతో కూడా విశ్లేషణలు రావు. ఇంత గట్టిగా నిలబడి మాట్లాడేవారు ఆ పార్టీకి దాదాపు లేనట్లే.
కాస్త విషయం వున్న వాళ్లు మన పక్కన వున్నపుడు, వాళ్లు ఒక్కోసారి మనకు ఇబ్బందికరంగా మాట్లాడినా సర్దుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే వాళ్లతో అవసరం అంతకు మించి వుంటుంది కనుక. ఈ విషయాన్ని అటు తెలుగుదేశం, ఇటు జనసేన రెండూ విస్మరించినట్లు కనిపిస్తోంది. ‘నీవు నేర్పిన విద్యయే’ అంటూ ఓ వీడియోను దిలీప్ సుంకర చేసారట.
ఒకప్పుడు చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసారు. దాన్ని బట్టే జగన్ ఇప్పుడు చేస్తున్నారనేది ఆయన భావం అయి వుండొచ్చు. దానికి తెలుగుదేశం వైపు నుంచి సమాధానం వచ్చింది. అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన మాట్లాడుతూ ఇలాంటి వీడియో చేయకుండా వుండాల్సింది అని కామెంట్ చేసారు. ఆ వీడియో ఈయనను బాధపెట్టింది. కానీ గమ్మత్తుగా జనసేన వైపు నుంచి ఎటువంటి మద్దతు కళ్యాణ్ సుంకరకు లభించలేదు. అది మరింత బాధపెట్టింది.
ఎమ్మెల్యే కావాలని కళ్యాణ్ సుంకర అనుకుంటున్నారు. అది ఆయన మాటల్లో కూడా స్పష్టమైంది. సరే టికెట్ ఇస్తారా, ఇవ్వరా, కాస్త విషయం వున్న వారిని, రెబల్ మెంటాలిటీ వున్నవారిని రాజకీయ నాయకులు భరించగలరా? లేదా? అన్నది కాస్త అనుమానమే. ఇలాంటి టైమ్ లో దేశం-సేన ల పొత్తు కుదిరింది. జనసేన వైపు నుంచి పవన్ ప్రకటన వచ్చింది. సర్దుకు పోవాలని, తగ్గి వుండాలని, పొత్తు విఘాతానికి అస్సలు తావు ఇవ్వకూడదని. ఇది కాపులకు నచ్చిందా.. నచ్చలేదా అన్నది వేరే సంగతి. ప్రస్తుతానికి జనసేన ఎజెండా అయితే అదే. ఇలాంటి దాంట్లో కళ్యాణ్ సుంకర ఇమడడం కాస్త ఇబ్బంది కరమైన పరిస్థితే.
అటు అవతల పార్టీ నుంచి కౌంటర్ రావడం, ఇటు ఇవతల పార్టీ నుంచి మద్దతు లభించకపోవడం, పవన్ వ్యతిరేకంగా చిన్నమెత్తు మాట అన్నా, ఆయన ఫ్యాన్స్ గుడ్డిగా ద్వేషించడం ఇలాంటివి అన్నీ కలిపి దిలీప్ సుంకర ను ఆర్నెల్ల పాటు తన రాజకీయ విశ్లేషణలకు పాజ్ బటన్ నొక్కేలా చేసాయి.
మళ్లీ ప్లే బటన్ ఎప్పుడు నొక్కుతారో చూద్దాం. నిజానికి ఆర్నెల్ల వరకు ఆగాలనే లేదు. మధ్యలో ఏదో ఒక లాజికల్ కన్విన్సింగ్ వీడియో చేసి మళ్లీ ఎంటర్ అయినా అవుతారు. అవ్వగలరు. దటీజ్ కళ్యాణ్ సుంకర.