పవన్ కల్యాణ్ ప్రేమలు, పెళ్లిళ్లు ఆయన వ్యక్తిగ వ్యవహారం. కానీ ఎప్పుడు వాటిపై చర్చ వచ్చినా అది టాక్ ఆఫ్ ది స్టేట్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ చేశారు. అయితే అది వన్ సైడ్ లవ్. పైగా ఇది పొలిటికల్ లవ్. పవన్ ప్రమేయం లేకపోయినా ఆయన్ను ఆరాధించి, అభిమానించి, ప్రేమించే మరో వ్యక్తి కథ.
ఇన్నాళ్లూ ఆ ఆరాధన అంతా మనసులోనే దాచుకున్నారు, ఇప్పుడే దాన్ని బయటపెట్టారు. పవన్ ఆల్రెడీ మరొకరితో లవ్ లో ఉన్నారని తెలిసినా కూడా తన ప్రేమను కూడా వ్యక్తపరిచారు. ఇంతకీ పవన్ జీవితంలో ఆ కొత్త ప్రేయసి ఎవరు..?
ప్రేయసి కాదు, ప్రియుడు..
అవును పవన్ ని ప్రేమిస్తుంది మహిళ కాదు, పురుషుడు. ఆ విషయం ఆయన బహిరంగ వేదికపైనే చెప్పాడు. ఇదేదో ఫన్ కోసమో, వ్యంగ్యంగానో చెబుతున్న మాట ఇది. నేరుగా చంద్రబాబు కుప్పంలో బహిరంగ వేదికపై చెప్పిన మాట. 2024 ఎన్నికల్లో పవన్ తో కలసి నడవాలంటూ ఓ కార్యకర్త సూచించగా చంద్రబాబు ఇలా నాటకీయంగా సమాధానమిచ్చారు.
ప్రేమ ఎప్పుడూ రెండువైపులా ఉండాలి, వన్ సైడ్ లవ్ ఉంటే ఎలా అంటూ బదులిచ్చారు. పవన్ కల్యాణ్ ని తాను ప్రేమిస్తున్నా.. ఆయన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదంటూ సినిమా స్టైల్ లో చెప్పారు బాబు.
పవన్ నన్ను ప్రేమించట్లేదు..
పవన్ కి కన్నుగీటినా, ప్రేమ లేఖలు రాసినా, ఇంకా ఇంకా ఏదేదో చెసినా ఆయన మాత్రం తనను ప్రేమించట్లేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. తన మనసులో మాట బయటపెట్టారు.
కార్యకర్త నిజంగానే ఆ ప్రశ్న అడిగారా..? లేక అడిగించారా..? ఈ సమాధానం కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్నదేనా..? అనే విషయాలు తెలియదు కానీ.. మొత్తానికి 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన మహా కూటమికి మాత్రం బీజం వేసేలా చంద్రబాబు డైలాగ్ కొట్టారు.
బీజేపీ ఎవరిని ప్రేమిస్తుంది..?
పవన్ కల్యాణ్ ఆల్రడీ బీజేపీతో లవ్ లో ఉన్నారు, మరి చంద్రబాబు కూడా ఆ లవ్ స్టోరీలోకి ఎంట్రీ ఇస్తే అది ట్రయాంగిల్ లవ్ అవుతుంది. మరి దీనికి బీజేపీ ఒప్పుకుంటుందా..? గతంలో ఉన్న ప్రేమే కదా, మధ్యలో బెడిసికొట్టింది అంతే కదా అంటూ మళ్లీ ప్యాచప్ అవుతుందా..? ప్రస్తుతానికయితే బీజేపీ నేతలు చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
వీర్రాజు ఎక్కడపడితే అక్కడ చంద్రబాబుపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రేమ ప్రపోజల్ ని అసలు పవన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అదే సమయంలో బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుంది అనే విషయం తేలాల్సి ఉంది.