మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతారు అనే సంగతి అందరికీ తెలుసు. ఒక అబద్ధాన్ని చెప్పి.. దాన్ని పదేపదే చెబుతూనే ఉండడం ద్వారా తన పార్టీ వారందరితోనూ అదే అబద్ధాన్ని చెప్పిస్తూ ఉండడం ద్వారా అమాయకులైన ప్రజలు అది నిజం అని నమ్మే పరిస్థితిని కల్పిస్తారని కూడా.. అందరూ అంటూ ఉంటారు. కానీ ఆయన ఏ రేంజిలో అబద్ధాలు చెబుతారో చాలా మందికి క్లారిటీ లేదు.
ఆ మాటకొస్తే రాజకీయ నాయకులు చాలా మంది అబద్ధాలు చెబుతూనే ఉండొచ్చు. కానీ ప్రతి అబద్ధానికీ ఒక లెక్క ఉండాలి. ప్రయోజనం ఉండాలి. చంద్రబాబునాయుడు ఏ ప్రయోజనమూ లేకపోయినా.. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరనే క్లారిటీ ఉన్నా.. అలవాటుగా అబద్ధాలు చెప్పేయగలరు. తాజాగా ఆయన తన కుప్పం పర్యటనలో కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు.
ఇంతకూ కుప్పం టూర్లో చంద్రబాబు మాటలు చూడండి..
‘అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలనుకున్నారు. ఈ లోగా కుప్పం మునిసిపల్ ఫలితాలు వచ్చేసరికి వారం రోజులు జరుపుతామని బీఏసీ సమావేశంలో జగన్ అన్నారు. చంద్రబాబు బాధ చూసి నేను ఆనందిస్తానని చెప్పిన దుర్మార్గపు సీఎం జగన్’ అని చంద్రబాబునాయుడు అన్నారు.
వాస్తవం ఏమిటి?
అసెంబ్లీ సమావేశాలను ఒక్కరోజు నిర్వహించాలని ప్రభుత్వం అనుకున్నమాట వాస్తవం. ఆ మాట ప్రకటించారు కూడా. అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే ప్రభుత్వం భయపడుతోంది.. జడుసుకుంటోంది.. అంటూ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంకెలు వేశారు. వారం రోజులు నిర్వహించి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు.
బీఏసీ సమావేశంలో కూడా వారం రోజులు అసెంబ్లీ ఉండాలని అడిగారు. తీరా ప్రభుత్వం ఒప్పుకుంది. ఒప్పుకుంటుందని వీరు ఊహించలేదు. ఒప్పుకోకపోతే.. మాకు భయపడి ఒక్కరోజులో ముగిస్తున్నారనే ప్రచారానికి సిద్ధమై ఉన్నారు. వారం రోజుల నిర్వహణకు ఒప్పుకునే సరికి బెదిరిపోయి.. తొలిరోజే తోకముడిచి అసెంబ్లీని బహిష్కరించి పారిపోయారు.
జరిగింది ఇదీ.. దానికి మసిపూసి మారేడుకాయ చేసి.. నా ఏడుపు చూడడానికే వారం రోజులు సభ జరిపాడని జగన్ గురించి చంద్రబాబు మాట్లాడడం అబద్ధం మాత్రమే కాదు.. చాలా చీప్ గా ఉంది.
అలాగే.. అచ్చెన్నాయుడుతో జగన్ అన్న ఒకే ఒక్క మాట ‘మీ నాయకుడి మొహం చూడాలని ఉంది’ అని! కుప్పంలో ఓటమి వలన చంద్రబాబు అవమాన భారం చూడాలని ఉన్నదనేది దాని ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆ ఒక్క మాటకు మసాలా పూసి ‘‘చంద్రబాబు బాధ చూసి నేను ఆనందిస్తానని చెప్పాడు’’ అంటూ చిలవలు పలవలు అల్లడం చంద్రబాబుకే చెల్లింది.
పాత విషయాలు ఎన్ని అబద్ధాలు బొంకినా నడుస్తుంది. ప్రజలందరికీ బాగా గుర్తుండే ఇటీవలి సంగతుల్లో కూడా.. అబద్ధాలు చెబితే.. ప్రజలు నవ్వుతారని ఈ మాజీ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి.