కరోనా నుంచి రక్షణ కేవలం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, నాయకులకేనా? మరి ఓటర్లకు అక్కర్లేదా? ఇప్పుడివే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా? వద్దా? అనే అంశంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు పలు రాజకీయ పార్టీలకు చెందిన ఒక్కో నేతతో సమావేశమైన ఎస్ఈసీ …మరి ఈ పరిస్థితిలో ఎన్నికలు ఎలా నిర్వహించాలనుకుంటున్నారో చెప్పాలని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఎటూ ఐదు నెలల్లో పదవీ కాలం ముగియనుందని, దీంతో ఎలాగైనా జగన్ సర్కార్‌ను వీలున్నంత వరకు బద్నాం చేయాలనే కుట్రతోనే నిమ్మగడ్డ బరి తెగించారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఈ సందర్భంగా సమావేశ నిర్వహణలోనే నిమ్మగడ్డ విషపూరిత స్వభావం బట్టబయలైందని నెటిజన్లు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు అభిప్రాయాలు చెప్పాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ 19 రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి పార్టీకి ఒకరు చొప్పున రావాలని సూచించారు.
సమావేశం అనంతరం నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటించినట్టు చెప్పారు. సామాజిక దూరం, జాగ్రత్తలను అనుసరించడానికి, సమయ స్లాట్లతో వ్యక్తిగత సంప్రదింపులు ఉత్తమ మైందిగా భావించినట్టు నిమ్మగడ్డ తెలిపారు. అంతేకాదు, సురక్షితమైన అంశంగా భావించి ఈ విధానాన్ని అమలు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్న నిమ్మగడ్డను తప్పక అభినందించాల్సిందే.
అయితే తమ వరకూ వచ్చే సరికి ఒక్కొక్కరితో పది నిమిషాల పాటు వ్యక్తిగతంగా చర్చించిన నిమ్మగడ్డ … ఇదే సూత్రాన్ని ఓటర్ల విషయంలో కూడా ఎందుకు పాటించరు? ఓటు వేయడానికి సమయ స్లాట్‌ను ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ఇవ్వగలరా? ఆ విధంగా ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందా? .
ఈ పరిస్థితుల్లో అసలు ఎన్నికలను ఇప్పటికిప్పుడే జరపాల్సినంత అత్యవసరం ఏంటి? జనాన్ని రిస్క్‌లోకి నెట్టేందుకు నిమ్మగడ్డ ఎందుకంత పంతం పట్టారనే ప్రశ్నలు , నిలదీతలు సామాజిక మాధ్యమాల నుంచి వస్తున్నాయి.
సామాజిక దూరం పాటిస్తూ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా? పది నిమిషాలు మాట్లాడ్డానికే నిమ్మగడ్డ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, మరి ఓటు వేయడానికి గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన ఓటరు పరిస్థితి ఏంటి? వాళ్ల ఆరోగ్య రక్షణకు నిమ్మగడ్డ ఏమైనా బాధ్యత తీసుకుంటారా? తమకైతే ఒక నీతి, ఓటర్లకైతే మరో నీతా? నోరు లేని వాళ్లని ఓటర్ల ఆరోగ్యాన్ని గాలికి వదిలి కక్ష సాధించాలనుకోవడం సబబా? అనే ప్రశ్నలు వెల్లు వెత్తుతున్నాయి. ఏమయ్యా నిమ్మగడ్డా … అర్థమవుతోందా జనాభిప్రాయాలు ఏంటో?