బీజేపీ సీమ డిక్ల‌రేష‌న్ క‌థ కంచికేనా?

 ప్ర‌స్తుత బీజేపీ రాష్ట్ర శాఖ‌…కేవ‌లం తాను గుంటూరు-కృష్ణా జిల్లాల పార్టీ అన్న‌ట్టు నిర్ణ‌యాలు చేస్తోంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. 2018, ఫిబ్రవ‌రి 23న క‌ర్నూల్‌లో ప్ర‌క‌టించిన రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌పై నోరు తెర‌వ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల‌పై…

 ప్ర‌స్తుత బీజేపీ రాష్ట్ర శాఖ‌…కేవ‌లం తాను గుంటూరు-కృష్ణా జిల్లాల పార్టీ అన్న‌ట్టు నిర్ణ‌యాలు చేస్తోంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. 2018, ఫిబ్రవ‌రి 23న క‌ర్నూల్‌లో ప్ర‌క‌టించిన రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌పై నోరు తెర‌వ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల‌పై విస్తృత‌మైన చ‌ర్చ జ‌ర‌గుతున్న నేప‌థ్యంలో కోస్తాకు చెందిన క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, సుజ‌నాచౌద‌రి త‌మ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కే ప‌రిమిత‌మై జ‌గ‌న్ స‌ర్కార్‌ను బెదిరిస్తున్నారు.

వారికి సీమ‌కు చెందిన సీఎం ర‌మేష్‌తో పాటు మిగిలిన సీమ‌ నాయ‌కులు మౌనంతో మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌క‌టించిన‌ప్పుడు ఆ పార్టీకి చెందిన విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, ఇత‌ర నాయ‌కులు  మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత ఏమైందో కానీ, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ప‌త్తా లేడు. 20 రోజుల క్రితం అంతా, ఇంతా అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన సీమ బీజేపీ నాయ‌కులు…ప్ర‌స్తుతం ఉలుకుప‌లుకు లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డంపై ఆ ప్రాంత ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ ప్ర‌క‌టించిన రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌లోని అంశాల‌ను వారు గుర్తు చేస్తున్నారు. దీనిపై బీజేపీ వైఖ‌రి ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్ర రాజ‌ధానిపై హ‌క్కులేని కేంద్ర ప్ర‌భుత్వ జోక్యాన్ని కోరుతున్నా బీజేపీ రాష్ట్ర నాయ‌కులు, హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయిలో హ‌క్కు ఉన్నా ఎందుకు ఏమీ చేయ‌డ‌లేద‌ని నిల‌దీస్తున్నారు.  ఊరికో మాట‌, పూట‌కో మాట మాట్లాడ‌టం మాని, గ‌ట్టి మేలు త‌ల‌పెట్టే ప‌నిచేయాలంటూ డిక్ల‌రేష‌న్‌ను గుర్తు చేస్తున్నారు.

బీజేపీ క‌ర్నూలు డిక్ల‌రేష‌న్‌
1.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రెండో రాజ‌ధాని రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాలి. వెంట‌నే ప్ర‌క‌ట‌న చేసి భూసేక‌ర‌ణ చేయాలి.
ఎ) అసెంబ్లీ భ‌వ‌నం నిర్మించి ప్ర‌తి ఆరునెల‌ల‌కి ఒక‌సారి క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర త‌ర‌హా అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాలి.
బి) సెక్ర‌టేరియ‌ట్ , త‌దిత‌ర కొన్ని శాఖ‌ల భ‌వ‌నాలు ఏర్పాటు చేయాలి.
సి) గ‌వ‌ర్న‌ర్ తాత్కాలిక విడిదికి నివాసం ఇక్క‌డ ఏర్పాటు చేయాలి.

2.రాయ‌ల‌సీమ‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే ప్ర‌క‌టించాలి. ప్ర‌స్తుతం ఏర్పాటు చేయ‌బ‌డుతున్న తాత్కాలిక హైకోర్టు సైతం రాయ‌ల‌సీమ‌లోనే ఏర్పాటు చేయాలి.

3.రాయ‌ల‌సీమ‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు 2018-19 బ‌డ్జెట్‌లో జానాభా ప్రాతిప‌దిక‌న నిధులు కేటాయించాలి. గ‌త బ‌డ్జెట్‌ల‌లో జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చేందుకు ప్ర‌త్యేక నిధుల‌ను కేటాయించి రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను , ప‌క్క రాష్ట్రాల‌కు కూలీల మ‌రియు నిరుద్యోగుల వ‌ల‌స‌ల‌ను ఆపాలి. రూ.20 వేల కోట్ల ప్ర‌త్యేక నిధిని రాష్ట్ర బ‌డ్జెట్ నుంచి కేటాయించాలి.

4.జ‌నాభా ప్రాతిప‌దిక‌న గ‌త మూడున్న‌రేళ్లుగా రాష్ట్రంలో పెట్టిన అభివృద్ధి ఖ‌ర్చుకు శ్వేత ప‌త్రం విడుద‌ల చేసి రాయ‌ల‌సీమ‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న నిధులు ఖ‌ర్చు పెట్టాలి.

5.ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం రాయ‌ల‌సీమ‌ను ప్ర‌స్తుతం నాలుగు జిల్లాల నుంచి 8 జిల్లాల‌కు పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే నిర్ణ‌యం చేయాలి.