‘రాజధానిని అడ్డుకోని పక్షంలో దేశం విడిచిపోతా. మరో దేశంలో కాందిశీకుడిగా బతుకుతా’…బ్యాంకులకు పెద్ద మొత్తంలో ఎగవేసిన బీజేపీ ఎంపీ సుజనాచౌదరి నోటి వెంట ఈ మాటలు వింటే, చదివితే ఎవరికైనా వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఎవరు…గట్టిగా అందరికీ వినిపించేలా మరోసారి చెప్పరూ….అవును మీరు చెబుతున్నది నిజమే.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం ఎల్లలు దాటి విదేశాల్లో దర్జాగా బతుకుతున్న విజయ్‌మాల్యా, నీరవ్‌మోడీ గుర్తుకొస్తున్నారని మీరు చెబుతున్న మాట అక్షరాలా నిజమే. రాజధానిపై సీఎం జగన్ సర్కార్‌ను బెదిరించాలనుకుని అవాకులు చెవాకులు పేలిన సుజనాచౌదరికి బీజేపీ అధిష్టానం జీవీఎల్ రూపంలో ‘చెక్’ పెట్టింది. దీన్ని ఓర్చుకోలేని సుజనాచౌదరి…మళ్లీ తన అక్కసును మరోసారి జగన్ సర్కార్‌పై వెళ్లగక్కాడు.
విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంతకూ ఆయన ఏమన్నాడంటే…
‘అసలు ఇక్కడ పౌరుడిగా ఉండటమే దండగ. శరణార్థులుగా వేరే చోటికి వెళ్లిపోవడం మేలు. ఈ దేశంలో ఉండడమే అనవసరం. ప్రజలందరూ కలసి రావాలి. రైతుల ఆందోళన చూస్తుంటే చాలా బాధగా ఉంది. అమరావతిని కాపాడుకోలేక పోతే ఈ పదవులు ఎందుకు? కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. పార్టీ పరంగా రైతులకు మద్దతు ఉంటుంది. నేను వ్యక్తిగతంగా పోరాడుతా. అమరావతిని అంగుళం కూడా మార్చలేరు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవరం’ అంటూ భావోద్వేగంతో ఆయన మాట్లాడాడు.
పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సుజనాచౌదరి రాజధాని సాకుతో విదేశాలకు పారిపోవాలని అనుకుంటున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీరవ్‌మోడీ, విజయమాల్యాల సరసన సుజనాచౌదరిని చేరుస్తూ చర్చించుకుంటున్నారు. రాజకీయ నేతల మాటలకు అర్థాలే వేరు. సుజనాచౌదరి మాటల్లో మర్మం ఏమిటో ఆయన అంతరాత్మకే తెలియాలంటున్నారు.