సడెన్ గా ఎందుకింత చెడ్డ అయ్యారబ్బా… ?

ఆయన సీనియర్ ఎమ్మెల్యే, మూడు సార్లు గెలిచిన నాయకుడు. ప్రజలకు అందుబాటులో ఉంటాడని పేరు. ఇక రాజకీయాల్లోకి రాక ముందు పూర్వాశ్రమంలో జెడ్పీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నత పదవిని నిర్వహించారు. రాజకీయాల్లో పుష్కర…

ఆయన సీనియర్ ఎమ్మెల్యే, మూడు సార్లు గెలిచిన నాయకుడు. ప్రజలకు అందుబాటులో ఉంటాడని పేరు. ఇక రాజకీయాల్లోకి రాక ముందు పూర్వాశ్రమంలో జెడ్పీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నత పదవిని నిర్వహించారు. రాజకీయాల్లో పుష్కర కాలం పైగా అనుభవం ఉంది. ఆయనే విశాఖ జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు.

ఒక విధంగా తెలుగుదేశానికి కంచుకోట లాంటి సీట్లో రెండు సార్లు వైసీపీ తరఫున‌, ఒకసారి కాంగ్రెస్ వైపునా జెండా ఎగరేసిన ఘనత బాబూరావుదే. అలాంటి బాబూరావు మీద ఇపుడు సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. అందులో ఒక బలమైన సామాజికవర్గం ముఖ్య పాత్ర పోషించడం ఇక్కడ చర్చకు వస్తోంది.

నిజానికి ఎస్సీ నియోజకవర్గం అయినా కూడా పాయకరావు పేటలో ఆ బలమైన సామాజికవర్గం అండ ఉండాల్సిందే. వారికి మంచి ఓటు బ్యాంక్ ఉంది. వారి మద్దతుతోనే ఎవరైనా గెలిచేది. వారిని కాదంటే ఇబ్బందులే ఎదురవుతాయని గతంలో కూడా రుజువు అయింది.

ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే మీద చేస్తున్న అవినీతి ఆరోపణలు కానీ, ఆయన క్యాడర్ కి అందుబాటులో ఉండడంలేదు అంటూ చెబుతున్నది కానీ గతంలో ఎపుడూ వినని మాటలే. మరో వైపు చూస్తే ఆయన వైఎస్సార్ ని జగన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చారు. వైస్సార్ మరణానంతరం జగన్ పార్టీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో గెలిచిన నేత.

జగన్ కి సన్నిహితుడు అని పేరు గడించిన ఆయన మంత్రి పదవి రేసులో కూడా  గట్టిగానే ఉన్నారు. ఇపుడు ఆయనకు పదవి దక్కితే విశాఖ జిల్లాలో ఒక బలమైన సామాజికవర్గం ఆశలు గల్లంతు అవుతాయన్న టాక్ కూడా ఉంది. అందుకే ఆ సామాజికవర్గం వారే ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ రచ్చ చేస్తున్నారు అని అనుమానాలను ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తం
చేస్తున్నారు

మొత్తానికి ఏ నిప్పూ లేకుండా హఠాత్తుగా పొగ రావడం, అది దావానల‌మే అని చెప్పేలా  పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేయడంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అయితే కిందా మీద అవుతున్నారు. మరి దీని వెనకాల అసలు  ఏముంది, నిజంగా బాబూరావు సొంత పార్టీ నేతలకు అంత చెడ్డ ఎందుకు అయ్యారు అన్నది లోతుగా సెర్చ్ చేయాల్సిన విషయమే అంటున్నారు వైసీపీ నేతలు. చూడాలి మరి లోతుల్లోకి వెళ్తే అసలు నిజాలు ఏవి బయటకు వస్తాయో.