జగన్.. వేడికోళ్లు అన్నీ బధిరశంఖారావాలేనా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తినకు వెళ్లారు. అక్కడ ప్రధాన మంత్రిని, ఆర్థిక మంత్రిని కూడా కలిశారు. మంగళవారం కూడా మరికొన్ని భేటీ ఉండవచ్చు. తర్వాత తిరిగి వస్తారు కూడా! ఇవాళ ప్రధానిని కలిసినప్పుడు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తినకు వెళ్లారు. అక్కడ ప్రధాన మంత్రిని, ఆర్థిక మంత్రిని కూడా కలిశారు. మంగళవారం కూడా మరికొన్ని భేటీ ఉండవచ్చు. తర్వాత తిరిగి వస్తారు కూడా! ఇవాళ ప్రధానిని కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అనేకానేక అంశాలను ఆయనకు ఏకరవు పెట్టారు. 

ఎంతగా అంటే.. విభజన తర్వాత.. ఏపీ ఏర్పడిన తొలి నాళ్ల నుంచి జరిగిన నష్టాలన్నింటినీ.. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఏకరవు పెట్టాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి ఏమేం విన్నపాలు చేశారో.. వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని ఏం చెప్పారో.. ఎలా స్పందించారో.. ఏయే హామీలు ఇచ్చారో.. ఏ రకంగా ఈ ఢిల్లీ పర్యటన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయబోతున్నదో ఈ అంశాలు వేటిమీదా స్పష్టత లేదు. 

జగన్ గతంలో కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలో మోడీ తర్వాత.. నెంబర్ టూగా చెలామణీ అవుతున్న అమిత్ షాను పలుమార్లు కలిశారు. పైగా విభజనకు సంబంధించి ఆంద్రప్రదేశ్ కు జరిగిన నష్టం ఏదైనా ఉంటే.. దానిని పూడ్చవలసిన ప్రధాన బాద్యత హోలం శాఖదే. ఆ హోంశాఖకు సారథి అమిత్ షానే గనుక ఆయనను కలిశారు. అప్పట్లో కూడా ఇంతకింత విన్నపాలు చేశారు. కానీ ఏం ఒరిగింది? 

ఇప్పుడు మళ్లీ అదే జాబితాలోని అన్ని విన్నపాలను మరికొన్నింటిని కలిపి ఇప్పుడు తిరిగి నివేదిస్తున్నారంటే.. దానర్థం ఏమిటి? గతంలో చేసిన విన్నపాలు అన్నీ వృథా పోయినట్లే కదా! ఇప్పుడు చేసిన విన్నపాలను మాత్రం కేంద్రం సానుకూలంగా చెవిన వేసుకుంటుందనే నమ్మకం ఎవరికైనా ఉన్నదా? అంటే టక్కున సమాధానం దొరకదు. 

కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదన్నమాట నిజం. అందుకే మోడీతో భేటీకి సంబంధించిన ఫోటోలు, ముఖ్యమంత్రి చేయగల విన్నపాల జాబితాలు బయటకు వచ్చాయి గానీ మోడీ స్పందన ఏమీ బయటకు రాలేదు. బహుశా మంగళవారం కూడా కొందరు మంత్రులను, కేంద్రంలోని పెద్దలను కలిసిన తర్వాత.. తిరిగి తాడేపల్లి పయనమయ్యే ముందు.. జగన్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. 

అయితే విశ్లేషకులు భావిస్తున్నదాన్ని బట్టి.. జగన్ ఎన్ని విన్నపాలు చేసినా సరే అవన్నీ కూడా బధిర శంఖారావాలే అవుతాయని అనిపిస్తోంది. బధిరశంఖారావం అంటే.. చెవిటివాడి ముందు శంఖం ఊదడం అని అర్థం. ఎంతగట్టిగా శంఖారావం చేసినా సరే.. చెవిటివాడిలో ఏం స్పందన సాధించగలం? అదేదో శంఖాన్ని నోట్లో పెట్టుకుని చేసే విన్యాసంలాగా వాడు భావిస్తాడు తప్ప.. శంఖారావానికి జడుసుకోవడం ఉండదు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న విన్నపాల పట్ల కేంద్రం స్పందిస్తున్న తీరు కూడా ఇలాగే ఉంటున్నది. అలా కాకూడదని తేలాలంటే.. ప్రధాని నుంచి ఏపీకి ఏం చేయబోతున్నారో.. జగన్ ఇచ్చిన వినతిపత్రంలోని అంశాల పట్ల కేంద్రం ఎలా స్పందిస్తున్నదో తెలిపే అధికారిక ప్రకటన పీఎంఓ నుంచి రావాలి. మీలో ఎవరికైనా.. అలాంటిది జరుగుతుందనే నమ్మకం ఉందా.. చూద్దాం!