విశాఖలోని గీతం విద్యా సంస్థల విషయం ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. అక్కడ ఏదో దారుణంగా కూల్చేశారని, ఏకంగా విద్యా వ్యవస్థనే చిదిమేశారని ఓ వైపు తెలుగుదేశం రాజకీయ రచ్చ చేస్తోంది.
మరో వైపు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఇది నిబంధనలకు అనుగుణంగా చేసిన కార్యక్రమం తప్ప ఇందులో వేరే దురుద్దేశ్యాలు కక్షలు అంతకంటే లేవని అంటున్నారు. సరే కూల్చివేతలపైన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న గీతం సంస్థలకు ముందు మరిన్ని కష్టాలు కూడగట్టుకుని వస్తున్నాయా అన్న మరో చర్చ కూడా వస్తోంది.
యూజీసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లోనే ఏ విద్యా సంస్థ అయినా భవనాలు కట్టాలి. వాటిని పరిశీలించిన మీదటనే అనుమతులు మంజూరు చేస్తారు. అయితే గీతం మెడికల్ కళాశాలను అక్రమ భూములలో కట్టారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా జాతీయ వైద్య మండలికి ఒక లేఖ రాశారు.
దాని ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరుతున్నారు. మరి దీని మీద కనుక జాతీయ వైద్య మండలి పూర్తి విచారణ జరిపితే కచ్చితంగా కఠినమైన చర్యలే ఉంటాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అని ఇదమిద్దంగా తెలియకపోయినా ఈ కూల్చుడు కధ ఇంతటితో ఆగేది కాదని మాత్రం వైసీపీ నేతల నుంచి వస్తున్న మాట.