ఉత్తరాంధ్ర, రాయలసీమలోని రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను కలుపుకుంటే… మొత్తం మూడు చోట్ల టీడీపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీలో అధికారంపై ధీమా పెరిగింది. దీంతో పొత్తులు అవసరం లేకుండానే సొంతంగా అధికారంలోకి వస్తామని భరోసా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో కనిపిస్తోంది. ఇదే సందర్భంలో జనసేనతో పొత్తు పెట్టుకోవడం అంటే, చేతికి ఆరో వేలుగా తయారవుతుందనే భయం కూడా లేకపోలేదు.
జనసేనతో పొత్తు పెట్టుకుని కొత్త సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీంతో జనసేన, ఇతర పార్టీలతో పొత్తులు లేకుండానే ఎన్నికలకు వెళ్లాలన్న ఒత్తిడి చంద్రబాబుపై పెరుగుతోంది. ఇప్పటికే ఆ రకమైన ఆలోచనలు టీడీపీలో కొంత కాలంగా సాగుతున్నాయి. తాజా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో టీడీపీలో అధికారంలోకి వస్తామన్న ధీమా రెట్టింపు అయ్యింది.
ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు పెట్టుకోవడం అనే ఆలోచనే అనవసరం అని, ఆ పార్టీకి 30 సీట్లు ఇవ్వడం వృథా అని, అంతే కాకుండా అధికారంలో వాటా అడుగుతుండడంపై కూడా టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనే సంకేతాలు తాజా ఎమ్మెల్సీ ఫలితాలతో నిర్ధారణ అయ్యిందని, అన్నీ తెలిసి జనసేనతో పొత్తు పెట్టుకోవడం అవివేకమవుతుందనే చర్చ మొదలైంది.
ఒకవేళ పవన్‌కల్యాణే పొత్తు కోసం వెంపర్లాడితే, పదికి మించి సీట్లు ఇవ్వొద్దని చంద్రబాబుకు తెగేసి చెబుతున్నారు. వారాహి డీజిల్ ఖర్చులు మాత్రమే భరించాలని, అంతకు మించి జనసేనకు రూపాయి ఖర్చు పెట్టినా అనవసరమనే భావన టీడీపీలో బలంగా వుంది. ఎలాంటి పొత్తుల్లేకుండా అధికారంలోకి వస్తామని నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం అని, అలాగే జనసేనతో పాటు ఇతర చిన్నాచితకా పార్టీలను ఫినిష్ చేయడానికి కూడా అవకాశం లభించిందనేది టీడీపీ నేతల వాదన.
చివరికి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండే మిగులుతాయని, మూడో పార్టీకి చోటు వుండదని బాబు మనసు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీ మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేస్తోంది. జనసేనను విడిపించుకోడానికి ఈ ఫలితాలు దోహదం చేస్తున్నాయని టీడీపీ నేతలు అంటుండడం గమనార్హం.