ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా అధికార పార్టీ ఓడిపోవడం, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గెలుపొందడంతో అమరావతి అనుకూల వాదులు సరికొత్త రాగాన్ని ఆలపిస్తున్నారు. వారికి దీటుగా వైసీపీ కౌంటర్ ఇస్తూ, ఎదురు దాడిని స్టార్ట్ చేసింది.
పరిపాలన రాజధాని ఇస్తామన్న ఉత్తరాంధ్రలో, అలాగే న్యాయ రాజధాని తెస్తామన్న రాయలసీమలో అధికార పార్టీని ఓడించడం అంటే… మూడు రాజధానులకు వారంతా వ్యతిరేకమని తేలిపోయిందనే వాదనను ఎల్లో మీడియా, టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు వినిపిస్తున్నాయి.
ఈ వాదనను అధికార పక్షం వైసీపీ దీటుగా తిప్పికొడుతోంది. గతంలో గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు రాజధాని అంశంపై చెప్పిన విషయాన్ని తెరపైకి తెస్తూ, ఎల్లో బ్యాచ్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడం విశేషం. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో వైసీపీని ఓడించడం ద్వారా, రాజధాని అమరావతికి మద్దతు తెలపాలని చంద్రబాబు వేడుకున్నారు.
ఒకవేళ టీడీపీని గెలిపిస్తే, మూడు రాజధానులకు మద్దతు ప్రకటించినట్టే అని ఆయన అన్నారు. కావున రాజధాని భవిష్యత్ గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల పరిధిలోని ఓటర్ల చేతిలో వుందని చంద్రబాబు తేల్చి చెప్పారు.
అయినప్పటికీ ఆ రెండు కార్పొరేషన్లలో వైసీపీకే పట్టం కట్టడాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని, దానికి రాజధానితో ముడిపెట్టడం సరికాదని హితవు చెబుతున్నారు. తాము ఓడిన చోట కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని గుర్తించుకోవాలని ఎల్లో బ్యాచ్‌కు హితవు చెబుతున్నారు.