ఏడెనిమిది నెలల నుంచి సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. అప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు అయితే చాలా తీవ్రమైన ఇబ్బంది తప్పడం లేదు. అవి ఎప్పటికి పూర్తవుతాయో, ఎప్పుడు విడుదల అవుతాయో అర్థం కాని పరిస్థితి.
థియేటర్లకు ఇప్పటికే ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. అవి నిండేది ఎప్పటికనేది ప్రస్తుతానికి కొశ్చన్ మార్కే! పరిణామాల్లో చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడాలు లేకుండా అందరికీ ఇబ్బందులు తప్పడం లేదు.
కొత్త సినిమాల అనౌన్స్ మెంట్లు, అవి పట్టాలెక్కడం కూడా లేటయ్యే అవకాశాలున్నాయి. దీంతో హీరోలకూ ఆదాయ మార్గాలు కాస్త తగ్గే ఉంటాయి! ఈ ఆటంకాలు ఏవీ లేకుంటే కోట్లకు కోట్ల రూపాయల పారితోషకాలు తీసుకుంటూ ఒక్కో స్టార్ హీరో ఈ గ్యాప్ లో కనీసం తలా ఒక సినిమా పూర్తి చేసే వారు! ఆ మేరకు అయినా నష్టం జరిగినట్టే!
అయితే ఆ నష్టాలేవీ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఇబ్బంది కానట్టుగా ఉన్నాయి. ఏకంగా వంద కోట్ల రూపాయల మొత్తంతో ఒక అపార్ట్ మెంట్ లో మూడు ఫ్లోర్లను కొనేశాడట హృతిక్. ముంబైలో అరేబియన్ సుముద్రం ఒడ్డున నిర్మితం అవుతున్న ఒక అపార్ట్ మెంట్ లో హృతిక్ భారీ ప్రాపర్టీ కొన్నాడట. దీని విలువ అటుఇటుగా వంద కోట్ల రూపాయలు అని బాలీవుడ్ మీడియా చెబుతూ ఉంది.
ఈ మూడు ఫ్లోర్లనూ కలిపి తన ఇంటిగా మార్చుకుంటాడట హృతిక్. నెలకిందటే ఈ డీల్ జరిగిందని, ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందని తెలుస్తోంది. ఆ మధ్య హృతిక్ ఒక ఖరీదైన విడాకుల డీల్ కూడా సెట్ చేసుకున్నాడు. భార్యకు విడాకులు ఇచ్చి, ఆమెతో ఫ్రెండ్లీగా గడుపుతున్నాడు. గతంతో పోలిస్తే హృతిక్ కెరీర్ కూడా కాస్త మందగమనంలోనే ఉంది. అయినా భారీ డీల్ తో ఈ హీరో వార్తల్లోకి రావడం గమనార్హం.