గత ఏడాది డిసెంబర్ పదహారో తేదీన విడుదల అయిన హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఇండియాలో రికార్డు స్థాయి వసూళ్లను సాధించుకుంది. ఈ సినిమా వసూళ్లు రెండు వందల కోట్ల రూపాయలను దాటేశాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రత్యేకించి హిందీ బెల్ట్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుందనే మాట వినిపిస్తోంది ట్రేడ్ వర్గాల నుంచి.
హిందీలో మంచి ప్రచార ఆర్భాటాల మధ్యన విడుదలైన 83 కన్నా.. స్పైడర్ మ్యాన్ వసూళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 83 మంచి అంచనాల మధ్యనే విడుదలైంది. అలాగే ఈ సినిమా కు భారీ ప్రచారమూ జరిగింది. క్రికెట్ లెజండరీ ప్లేయర్లు, సినిమా స్టార్లు దీని ప్రచారానికి సాగి వచ్చారు. పాజిటివ్ రివ్యూల దక్కాయి. అయినా.. వసూళ్ల విషయంలో మాత్రం ఈ సినిమా వెనుకబడిందని సమాచారం.
స్పైడర్ మ్యాన్ ఊపు ముందు 83 చిన్నబోయిందట! ప్రత్యేకించి 83లో సుమారు గంట సేపు క్రికెట్ మ్యాచ్ సాగడం.. పెద్ద మైనస్ పాయింట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పాజిటివ్ బజ్ వచ్చినా.. సినిమా చూడటం 1983 క్రికెట్ వరల్డ్ కప్ హైలెట్లను చూసినట్టుగా అనిపించిందని, ఇది కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
83 వెనుకబడటంతో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వసూళ్లకు ఊతం ఇచ్చిందని అంచనా. ఫలితంగా స్పైడర్ మ్యాన్ లేటెస్ట్ వెంచర్ రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంటోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.