ఆర్ఆర్ఆర్.. అందరికీ ఓ గుణపాఠం

ఆర్ఆర్ఆర్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లతో సమస్య లేదు. ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి, రిలీజ్ కి ఇబ్బంది లేదు, ఇటీవలే ఏపీలో కూడా మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో ఆల్ ఈజ్…

ఆర్ఆర్ఆర్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లతో సమస్య లేదు. ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి, రిలీజ్ కి ఇబ్బంది లేదు, ఇటీవలే ఏపీలో కూడా మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి కనపడుతోంది. కానీ ఢిల్లీలో థియేటర్లు మూతబడ్డాయి, కర్నాటకలో ఆంక్షలున్నాయంటూ దర్శక నిర్మాతలు ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేసుకున్నారు. ఆ దెబ్బకి మిగతా సినిమాల లెక్కలన్నీ మారిపోయాయి. ఆర్ఆర్ఆర్ తో మిగిలినవారంతా కన్ఫ్యూజన్లో పడిపోయారు. జనవరి 7 అనే మంచి టైమింగ్ ని ఆర్ఆర్ఆర్ వల్ల అందరూ మిస్ అయ్యారు.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం జనవరి 7ను లాక్ చేసిన తర్వాత, దానికి దగ్గర్లోకి రావడానికి మిగతా సినిమాల నిర్మాతలు ఆచితూచి స్పందించాల్సి వచ్చింది. రాధేశ్యామ్ నిర్మాతలు మాత్రం ధైర్యం చేసి జనవరి 14న రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వల్ల దాదాపుగా నెల రోజులు బ్లాక్ అయిపోయింది. మిగతా సినిమాలేవీ వాటి దగ్గర్లోకి రాలేదు. కానీ ఇప్పుడేమైంది. నా ఘర్ కా – నా ఘాట్ కా అన్నట్టుంది పరిస్థితి.

ఆర్ఆర్ఆర్ తినలేదు, మిగతావారిని తిననీయలేదు. వీటి వల్ల భీమ్లానాయక్ వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా భీమ్లాని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. ఆర్ఆర్ఆర్ వస్తుందని బాలీవుడ్ లో కూడా గంగూబాయి లాంటి సినిమాల్ని వాయిదా వేయించారు. మొత్తమ్మీద ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కు ముందే రచ్చ రచ్చ చేసి తాను మాత్రం సైలెంట్ గా తప్పుకుంది. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ ను తప్పుపట్టాల్సిన పనిలేదు. పరిస్థితుల ప్రభావం అలాంటిది.

'రాధే' మోడల్ ఫాలో అయితే మంచిదేమో..!

సరిగ్గా కొన్ని రోజుల కిందట ఇదే పరిస్థితి సల్మాన్ సినిమాకు వచ్చింది. రాధే సినిమా విడుదల టైమ్ లో కూడా లాక్ డౌన్ పరిస్థితులున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటికంటే కాస్త దారుణంగానే ఉంది అప్పటి పరిస్థితి. అందుకే రాధే సినిమాను ఇటు అందుబాటులో ఉన్న థియేటర్లలో రిలీజ్ చేస్తూనే, మరోవైపు ఓటీటీలో కూడా డైరక్ట్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ఈ మోడల్ ఆ సినిమాకు బాగా ప్లస్ అయింది. మరి ఆర్ఆర్ఆర్ కోసం ఈ ఎత్తుగడను ఎందుకు ఫాలో అవ్వలేదో మేకర్స్ కే తెలియాలి. బహుశా.. ఇలా చేయడం వల్ల రికార్డులు సృష్టించడం కష్టమని భావించారా లేక లాభాలు రావని భయపడ్డారో..!

కానీ ట్రేడ్ అభిప్రాయం ప్రకారం ఇప్పుడున్న గందరగోళ పరిస్థితుల్లో రాధే మోడల్ ను ఫాలో అవ్వడమే ఆర్ఆర్ఆర్ కు ఉత్యుత్తమం. ఇలా చేయడం వల్ల ఇతర సినిమాలకు కాస్త ఊరట లభించేది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేయడం వల్ల మరో 4-5 నెలల వరకు రిలీజ్ డేట్స్ అన్నీ మరోసారి అస్తవ్యస్థం అవుతాయి.

మొత్తమ్మీద ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీకి ఓ మంచి గుణపాఠం చెప్పింది. భోజనం రెడీ చేసుకోవడం మాత్రమే కాదు, మహూర్తాలు చూసుకోకుండా ఆకలి ఉన్నప్పుడే దాన్ని ఆరగించాలనేది ఆ పాఠం. మహూర్తం చూసుకుని విందు వడ్డించుకునే సరికి అసలు మేటర్ ముగిసిపోయింది. ఆర్ఆర్ఆర్ కాపీ రెడీ అయినప్పుడే డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది, లేదంటే సమ్మర్ వరకు సైలెంట్ గా ఉన్నా సరిపోయేది. ఈ రెండూ చేయకపోవడం వల్ల ఆర్ఆర్ఆర్ మేకర్స్ పై విమర్శలు తప్పలేదు. పరిస్థితుల కంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నే అందరూ తిట్టుకోడానికి కారణం అదే.