'సీఎం జగన్ మోహన్ రెడ్డి తల కిందుల తపస్సు చేసినా రాజధానిని మార్చలేరు..' అని అంటున్నారు తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తల కిందుల తపస్సు చేసినా ఎమ్మెల్యేగా నెగ్గలేకపోతున్న సోమిరెడ్డికి ఈ తరహాలో మాట్లాడటం ఏమీ కొత్త కాదు. ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా.. బీరాలు పలకడంలో, భారీ సవాళ్లు చేయడంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పండిపోయారు.
ప్రత్యేకించి జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి సోమిరెడ్డి మోహన్ రెడ్డి తెలుగుదేశంలో రెడీగా ఉండే రెడ్డి గారు. జగన్ గురించి అనుచితమైన ప్రకటనలు చేయడానికి, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడానికి… కొంతమంది రెడ్డి గార్లను చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటూ ఉంటారంటారు. అందులో సోమిరెడ్డి ఒకరు. అయితే ఇలాంటి టీడీపీ రెడ్డి గార్ల రాజకీయ పరిస్థితి ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే.
ఆ సంగతలా ఉంటే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని ప్రకటన గురించి సోమిరెడ్డి స్పందించిన తీరు యథారీతిన కామెడీగా ఉంది. అదెలా ఉంటే.. తాము రాజధానిని మార్చాలని అనుకుంటున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. ఇప్పటికీ వైసీపీ మంత్రులు, నేతలు కూడా అదే విషయమే చెబుతున్నారు. రాజధానిని మార్చడం లేదని.. తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఉందని వారు అంటున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని, అమరావతితో పాటు కర్నూలు, విశాఖలు కూడా రాజధాని నిర్మాణాలను పంచుకుంటాయని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ చేసిన ప్రకటన కూడా అదే. రాజధానిని మార్చడం లేదు.
మరి ఆ అంశాన్ని పట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇలాంటి కామెడీలు చేస్తూ ఉన్నారు. రాజధానిని మార్చలేడు జగన్ అంటున్నారు.. ఆయన కూడా మారుస్తానని అనడం లేదు. ఇలాంటి కామెడీలు చేసే సోమిరెడ్డి జనాల దృష్టిలో సీరియస్ సబ్జెక్ట్ కాలేకపోతున్నారు. అయినా ఆయన తీరు మారుతున్నట్టుగా లేదు!