చిత్రం: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
రేటింగ్: 2/5
తారాగణం: నాగ శౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, శ్రీవిద్య, హరిణి, అభిషేక్ మహర్షి, సౌమ్య వారణాసి తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్
ఎడిటింగ్: కిరణ్ గంటి
కెమెరా: సునీల్ కుమార్ వర్మ
నిర్మాత: విశ్వ ప్రసాద్
దర్సకత్వం: శ్రీనివాస్ అవసరాల
విడుదల తేదీ: 17 మార్చ్ 2023
శ్రీనివాస్ అవసరాల నటుడిగా, రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా సటిల్ కామెడీని పండించడం తన ట్రేడ్ మార్క్. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద తర్వాత దర్శకుడిగా ఈ సినిమాతో ముందుకొచ్చాడు.
విషయంలోకి వెళ్తే సంజయ్ పీసపాటి (నాగ్ శౌర్య), అనుపమ కస్తూరి (మాళవిక నాయర్) కాలేజీ నాటి నుంచి పరిచయస్తులు. ఆయితే ఆమె అతనికన్నా ఏడాది సీనియర్. ఆ పరిచయం స్నేహంగా, స్నేహం పొసెసివ్నెస్ గా మారుతుంది. అది ప్రేమ అని తెలియడానికి వాళ్లకి చాలా టైం పడుతుంది. అది క్లైమాక్స్. అయితే ఆ క్లైమాక్స్ కి చేరుకునే వరకు రకరకాల సబ్ ప్లాట్స్ తో పాటు గిరిరాజ్ కామర్సు (అవసరాల శ్రీనివాస్) పాత్ర కూడా ఎంటరవుతుంది. అలాగే హీరోయిన్ కి హీరో మీద పొసెసెవ్నెస్ క్రియేట్ చేయాడానికన్నట్టుగా పెట్టిన పూజ (మేఘా చౌదరి) పాత్ర, హీరోకి హీరోయిన్ మీద పొసెసివ్నెస్ పెంచడానికి పెట్టిన సునీల్ (కిట్టు విస్సాప్రగడ) పాత్రలు కూడా కనిపిస్తాయి.
రెండు గంటల ఆరు నిమిషాల సినిమాయే అయినప్పటికీ పెద్ద సినిమాలా అనిపిస్తుంది. దానికి కారణం కథనంలో ఒక ఆర్గానిక్ ఫ్లో లేకపోవడం. స్క్రీన్ ప్లే లో గందరగోళం. ముందుకి వెనక్కి, వెనక్కి ముందుకు వెళ్లడం వల్ల కథని ఏ ఎమోషన్ తో కనెక్ట్ చేసుకోవాలో అర్ధం కాదు. పై పెచ్చు సదరు హీరో కేరక్టరైజేషన్ కూడా తికమకగా ఉంటుంది. ఒకానొక సందర్భం నుంచి అతను అనుపమకి దూరమవుతున్నట్టుగా ఉంటాడు. ఎందుకవుతున్నాడో తెర మీద పాత్రలతో పాటు ప్రేక్షకులకి కూడా తెలియదు. కానీ దానికి చివర్లో చెప్పిన కారణంలో బరువు అస్సలు సరిపోలేదు. హీరో పాత్రకి ఆ విషయం పెద్దది అనిపించొచ్చు కానీ చూసే ప్రేక్షకులకి మాత్రం అనిపించదు. అనిపించేలా కథనం లేకపోవడమే ఇక్కడ మైనస్. అదే ఈ చిత్రాన్ని బిలో ఏవరేజ్ గా నిలబెట్టేస్తుంది.
అవసరాల వారి కామెడీ ఇంచుకైనా కూడా లేకుండా నీరసంగా సాగే ఈ సినిమాలో మధ్యమధ్యలో “చాప్టర్-1', “చాప్టర్2” అంటూ చూపించినప్పుడల్లా ప్రేక్షకుల నిట్టూర్పులు వినిపించాయి. “ఇంకా ఎన్ని చాప్టర్లున్నాయిరా బాబూ!” అని నిట్టూర్చాడొక ప్రేక్షకుడు. అది విని పక్కవాళ్లు తమ మనసులో మాట ఆ నిట్టూర్పులో ధ్వనించిందన్నట్టుగా నవ్వారు. ప్రధమార్ధమంతా సుదీర్ఘమైన షార్ట్ ఫిల్మ్ లా నడుస్తుంది. రాగింగ్ సీన్స్ అయితే విసిగిస్తాయి.
ఇంటర్వల్ పడినా కూడా ఎటువంటి ఫీలింగ్ కలగదు. ద్వితీయార్ధం కూడా అదే పరిస్థితి. కాస్త చివర్లో నీలిమ అనే పాత్ర వచ్చేటప్పటికి శ్రీనివాస్ అవసరాలలోని రైటర్ నిద్రలేచాడనిపిస్తుంది. అతని నుంచి కోరుకునేది అలాంటి ట్రాక్, అలాంటి డైలాగ్స్. అయితే అది కూడా కాసేపే ఉండడం, ఆ నటీమణి అంత ఆకట్టుకోకపోవడం, చివరికి మళ్లీ బరువెక్కి భారంగా ముగియడంతో పెదవి విరిచేయాల్సిన పరిథితి ఏర్పడింది.
టెక్నికల్ గా చూస్తే కళ్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. ట్యూన్స్ రెట్రో స్టైల్లో ఉన్నాయి. అయితే ఎక్కడా హుకింగ్ గా, హాంటింగ్ గా లేవు. “కఫిఫి” పాట టేకాఫ్ ప్రామిసింగ్ గా అనిపించినా తర్వాత ఏవరేజ్ అనిపిస్తుంది. “నీతో..” పాట మాత్రం ట్యూన్, లిరిక్ పరంగా బాగుంది. కెమెరా, ఎడిటింగ్ వగైరాలు ఓకే.
నాగశౌర్యకి చాలా ఎమోషన్స్ పండించగలిగే స్కోపున్నా ఎందుకో రొటీన్ గా అనిపించాడు. బహుశా దర్శకుడు అంత అవసరం ఫీలవలేదేమో అనిపిస్తుంది.
మాళవిక నాయర్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హీరోయిన్ మేఘా బబ్లీగా, ఆకర్షణీయంగా, ఏక్టివ్ గా ఉంది. ఉన్నంతలో ఆమె తన నటనా ప్రతిభని కూడా చూపగలిగింది. శ్రీనివాస్ అవసరాల గెస్ట్ కంటే పెద్దదైన పాత్రలో కనిపించాడు.
మిగిలిన నటీనటులంతా పర్వాలేదు. ఎక్కువగా లండన్ కు చెందిన తెలుగు నటీనటుల్ని వాడారు.
ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ యూత్ కంటే 40 ఏళ్ల వాళ్ళేమో అనిపిస్తుంది. ఎందుకంటే కథ నడిచేది 2000-2010 నాటి కాలేజీ రోజులు, పెళ్లి వగైరాలు. నేపథ్యం కానీ, ఎమోషన్స్ కానీ, బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే పాటలు కానీ అంతకంటే పాతకాలంగా ఉన్నాయి. కనుక 40ల్లో ఉన్నవాళ్లకి నాస్టాల్జిక్ గా ఉండొచ్చేమో కానీ ప్రస్తుత యువ ప్రేక్షకులు కనెక్ట్ కావడానికి పెద్దేమీ లేదిందులో.
బ్యాక్ డ్రాప్ ఏదైనా, కథ అప్పటిదైనా కట్టి పారేసే ఎమోషన్స్ ఉంటే అవేవీ అడ్డు రావు. అది లేకనే అవన్నీ దోషాలుగా కనిపిస్తున్నాయి ఈ చిత్రంలో.
ఏది ఏమైనా ఇది శ్రీనివాస్ అవసరాల జారవిడుచుకున్న అవకాశంలా ఉంది. కథనంలో ఉన్న కంఫ్యూజన్ స్క్రిప్ట్ స్టేజిలోనే గమనించకపోవడం పొరపాటు. ఏ రకమైన ఎమోషన్ కి గురిచేయని పేలవమైన కథా కథనాలతో కూడిన చిత్రం ఈ “ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి”. పైన చెప్పుకున్నట్టు ఫలానా 40 వయసు పైబడ్డ ప్రేక్షకులు ఓపిక, తీరిక ఉంటే చూడొచ్చేమో!
బాటం లైన్: ఫలానా ప్రేక్షకులకి మాత్రమే