రెండు వేల రూపాయల నోట్ల మారకం నుంచి ఆర్బీఐ వెనక్కు తీసుకుంటూ, ఆ నోట్లను జమ చేయడానికి ఈ సెప్టెంర్ 30వ తేదీని చివరి తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు సమయంలో తీసుకొచ్చిన ఈ రెండు వేల నోటును కేంద్రం మళ్లీ రద్దు చేసింది. దీంతో ఈ నోట్లను కలిగిన వారు వాటిని బ్యాంకుల్లో ఇస్తూ వచ్చారు. వాస్తవానికి చాన్నళ్ల కిందటే ఈ నోటు ప్రింట్ ను ఆర్బీఐ ఆపేసింది. ఆ తర్వాత మారకంలో ఇవి పెద్దగా కనిపించకుండా పోయాయి!
ఇప్పుడు వాటికి ఆర్బీఐ ముగింపు పలుకుతూ ఉంది. అయితే.. ఆ గడువు ఇంకో నాలుగు రోజులే ఉన్నా.. ఇంకా ఆర్బీఐ వద్దకు వెళ్లాల్సిన రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య గట్టిగానే ఉందట! మరో నాలుగు రోజులే గడువు ఉన్నా.. ఇంకా ఆర్బీఐ వద్దకు చేరాల్సిన రెండు వేల నోట్ల మొత్తం 24 వేల కోట్ల రూపాయలట!
ఈ గణాంకాలు ఆర్బీఐ వివరిస్తున్న వివరాల ప్రకారమే తెలుస్తోంది. తాము ప్రవేశ పెట్టిన రెండు వేల నోట్లు ఎన్నో ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉండనే ఉంటాయి. తిరిగి వచ్చిన వాటిని లెక్కబెడుతూ ఉన్నారు. సెప్టెంబర్ ఒకటి నాటికే 93 శాతం రెండు వేల రూపాయల నోట్లు తిరిగి వచ్చి చేరాయని ఆర్బీఐ ప్రకటించింది. మరి నాలుగు రోజులే గడువు ఉన్నా.. ఇంకా 24 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరాల్సి ఉండటం గమనార్హం!
మరి నాలుగు రోజుల్లో అంత మొత్తం తిరిగి చేరే అవకాశాలు తక్కువే అనుకోవాలి. మరి 24 వేల కోట్ల రూపాయల నోట్లు ఏమైనట్టు? నల్లధనికుల దగ్గర పేరుకుపోయి.. వారు బ్యాంకుల వద్ద వాటిని చూపించలేక ఆగిపోయినట్టా! అయితే ఈ నోట్ల రద్దులు నల్ల ధనికులను ఏమీ చేయలేకపోతూ ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు. వారి దారుల్లో వారు నిశ్చితంగా మార్చుకుంటూ ఉంటారు.
నిరాక్షరాస్యుల వద్ద, ఈ అంశంపై పూర్తి అవగాహన లేని వారి వద్ద కూడా కొంత మేర నోట్లు మిగిలిపోయి కూడా ఉండొచ్చు! ఏదేమైనా 24 వేల కోట్ల రూపాయలంటే చిన్నమొత్తం అయితే కాదు. మరి ఈ అంశంపై ఆర్బీఐ చివరకు ఏం చెబుతుందో!