తమను విభేదించడమే కాకుండా అతి చేస్తున్నాడనే భావనతో ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రగిలిపోతున్నారని సమాచారం. వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న ఆ ప్రజాప్రతినిధే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. తనను నమ్మి వచ్చాడనే అభిమానంతో ఓ వార్డు స్థాయి నాయకుడైన కోటంరెడ్డిని శ్రీధర్‌రెడ్డిని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రోత్సహించారు. 2014, 2019లలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు గెలిపించుకున్నారు.
అయితే ఎమ్మెల్యే పదవితో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంతృప్తి చెందలేదు. మంత్రి పదవిని ఆశించారు. కానీ నెల్లూరు జిల్లాలోని రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. కానీ మొదటి నుంచి తన వెంట ప్రయాణిస్తున్నాడనే కారణంతో శ్రీధర్‌రెడ్డిపై జగన్ ప్రత్యేక అభిమానాన్ని చూపేవారు. ఆ అభిమానాన్ని కోటంరెడ్డి నిలుపుకోలేకపోయారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏదో ఒక సాకుతో ప్రభుత్వంపై ఘాటు విమర్శలకు శ్రీధర్‌రెడ్డి దిగడం గమనార్హం. శ్రీధర్‌రెడ్డిలో తేడా గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. కోటంరెడ్డికి కావాల్సిన పనులు చేయాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీని ధిక్కరించే ఆలోచనలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనదైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి.
తన సెల్‌ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పదేపదే ఘాటు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా తన ఎదుట కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఓవరాక్షన్ చేయడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని చేపట్టారు.
ఇదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్లకార్డుతో సభలో నిరసనకు దిగడం గమనార్హం. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మధ్యలో మాట్లాడి అంతరాయం కలిగించకూడదని స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యలుంటే చెప్పాలని… ప్రభుత్వానికి, గవర్నర్‌కు తెలియజేస్తానని స్పీకర్ అన్నారు. మీ ఆందోళనను తాను, ఈ హౌస్ చూస్తోందని, ఇట్లే నిరసన కొనసాగించడం సరైంది కాదని స్పీకర్ చెప్పినా కోటంరెడ్డి వినిపించుకోలేదు. నిరసన ఆపితే ప్రభుత్వం స్పందిస్తుందన్న స్పీకర్ మాటల్ని కోటంరెడ్డి పెడచెవిన పెట్టారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందిస్తూ సమస్యల్ని తెలియజేస్తే తప్పక స్పందిస్తామన్నారు. అలాగే ఏ వేదికపై సమస్యలను పరిష్కరించుకోవాలో చూడాలన్నారు. మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ శ్రీధర్‌రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే రగడ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఇబ్బంది పెట్టి, తద్వారా ప్రజల దృష్టిలో పడాలని కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని విరుచుకుపడ్డారు. అతన్ని క్షమించొద్దని, అవసరం అయితే చర్యలు తీసువాలని స్పీకర్‌కు మంత్రి అంబటి విన్నవించడం విశేషం. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారశైలిపై ఇప్పటికే జగన్ గరంగరంగా ఉన్నారని తెలిసింది. తాజా ఎపిసోడ్‌తో కోటంరెడ్డికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ ప్రజాప్రతినిధులు రగిలిపోతున్నారని సమాచారం. రానున్న రోజుల్లో కోటంరెడ్డికి రిటర్న్ గిఫ్ట్ సీఎం జగన్ నుంచి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.