1973లో వచ్చింది తమిళ సూపర్ స్టార్ ఎంజిఆర్ ‘లోకం చుట్టిన వీరుడు’. తెలుగులో కూడా బ్రహ్మాండంగా ఆడేసిన సినిమా ఇది. ఎంజిఆర్ స్వంతంగా నిర్మించిన ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద బడ్జెట్ సినిమా. ఇందులో సైంటిస్ట్ గా, సీక్రెట్ ఏజెంట్ గా డబుల్ రోల్ చేసారు. పైగా దర్శకుడిగా ఇది ఎంజిఆర్ కు రెండో సినిమా.
ఈ సినిమాలో జయలలిత హీరోయిన్ అనుకుని, చిన్న మాట తేడా వల్ల లాస్ట్ మినిట్ లో ఆమెను తప్పించి మంజులను తీసుకున్నారు. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే చాలా అంటే చాలా దేశాల్లో షూటింగ్ జరుపుకున్న సినిమా ఇది. కథ ప్రకారం కథనం చాలా దేశాల్లో వుంటుంది. అందుకే అలా చేసారు.
ఇలా కథ ప్రకారం పలు దేశాల్లో షూట్ చేసిన సినిమాలు వున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే ఇప్పుడు మరో సినిమా ఇలాంటి స్టయిల్ లో రెడీ కాబోతోంది. అడవి శేష్ హీరోగా, గూఢచారి 2 సినిమా స్టార్ట్ కాబోతోంది.
గూఢచారి సినిమా పార్ట్ వన్ పెద్ద హిట్. పైగా ఇది దేశంలోని పలు లోకేషన్లలో చిత్రీకరించారు. ఇప్పుడు సీక్వెల్ ను మరింత భారీగా చిత్రీకరించబోతున్నారు. ఈసారి కథ దేశంలోని పలు ప్రాంతాల్లో కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో తిరుగుతుంది.
గూఢచారి 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది ఇప్పుడు. సినిమా పలు దేశాల్లో తీయాల్సి వుంటుంది కనుక, బడ్జెట్ కూడా అంతకు అంతా వుంటుంది. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ లెక్కలు కూడా కడుతున్నారు. ఈ లెక్కలు, ఆ స్క్రిప్ట్ రెడీ అయితే అప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుంది.