టీడీపీ పీడ పోవాల్సిందేః జేసీ

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి టీడీపీ పీడ పోవాల్సిందేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.  ‘పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీవోకే) స‌మ‌స్య‌ను స‌మ‌సిపోయేలా చేస్తే బీజేపీలోకి రావ‌డానికి సిద్ధంగా ఉన్నా. దేశంలో…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి టీడీపీ పీడ పోవాల్సిందేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.  ‘పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీవోకే) స‌మ‌స్య‌ను స‌మ‌సిపోయేలా చేస్తే బీజేపీలోకి రావ‌డానికి సిద్ధంగా ఉన్నా. దేశంలో ప్రాంతీయ పార్టీల పీడ పోవాల్సిందే. మా తెలుగుదేశంతో స‌హా’ అని జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. జేసీ మాట‌లు తీవ్ర సంచ‌ల‌న‌మ‌య్యాయి.

అనంత‌పురం జిల్లా యాడికిలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ త‌ర్వాత అనంత‌పురంలో బీజేపీ నేత స‌త్య‌కుమార్‌ను ఆయ‌న క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకొంది. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్రాల్లో ప‌రిపాల‌న బాగుండాలంటే ప్రాంతీయ పార్టీలు పోయి జాతీయ పార్టీలు రావాల‌ని ఆకాంక్షించారు.

జాతీయ పార్టీల్లో దండించే పెద్ద దిక్కు ఉంటుంద‌ని, బీజేపీలో మోడీ, కాంగ్రెస్‌లో సోనియాగాంధీ ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. ప్రాంతీయ పార్టీల్లో దండించే వారు లేక‌పోవ‌డంతో వారు ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా సాగుతోంద‌ని విమ‌ర్శించారు.సోమ‌వారం అనంత‌పురం రానున్న కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డిని క‌ల‌వ‌నున్న‌ట్టు జేసీ చెప్పారు. గ‌తంలో ఢిల్లీలో బీజేపీ ఎంపీ సుజ‌నాచౌద‌రి ఇంట్లో ఆ పార్టీ అగ్ర‌నేత న‌డ్డాను జేసీ క‌లిసిన విష‌యం తెలిసిందే.

అప్ప‌ట్లోనే జేసీ బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు పీవోకేను భార‌త్‌లో క‌లిపితే బీజేపీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించ‌డంతో పాటు ప్రాంతీయ పార్టీల పీడ పోవాల‌ని జేసీ వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపుతున్నాయి. అంతేకాకుండా జేసీ ట్రావెల్స్‌పై జ‌గ‌న్ స‌ర్కార్ దాడులు చేయించ‌డం వివాదం రేపుతోంది. ఈ మొత్తం ప‌రిణామాల‌ను చూస్తుంటే త్వ‌ర‌లో బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. కేవ‌లం టీడీపీని వీడ‌డానికి జేసీ సాకులు వెతుక్కుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.