ఎవరు అవున్నన్నా కాదన్నా కూడా విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. ఇది అందమైన గమ్యం. కాశీకి వెళ్ళాలని ఆధ్యాత్మికపరులు ఎలా కోరుకుంటారో వైజాగ్ చుట్టి రావాలని పర్యాటక ప్రియులు అలాగే ఆరాటపడతారు. వైజాగ్ ఎపుడూ కూడా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటుంది.
అటువంటి విశాఖ గురించి చంద్రబాబుకూ తెలుసు. అయితే రాజధాని అని పేరు పెట్టడానికి ఆయనకు మనసొప్పలేదు కానీ, జాతీయ అంతర్జాతీయ సదస్సులన్నీ కూడా విశాఖలోనే నిర్వహించారు. అంతెందుకు తొలి క్యాబినెట్ మీటింగు కూడా బాబోరు విశాఖలోనే పెట్టారు.
ఇపుడు జగన్ వైజాగ్ అంటూంటే మాత్రం బాబు గారు అంతెత్తున లేస్తున్నారు. విశాఖ వద్దు, అమరావతి ముద్దు అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మంత్రి బొత్స సత్యనారాయణకు మాత్రం రోజురోజుకూ విశాఖ మీద ప్రేమ అలా పెరిగిపోతోంది.
ఆయన పెద్ద మాస్టారులా మారి మరీ మార్కులు కూడా వేసేస్తున్నారు. అమరావతిలో ఏముంది, అంతా విశాఖలోన ఉందని బొత్స మాస్టారు అంటున్నారు. అమరావతికి విశాఖకు పోలిక పెడితే తాను విశాఖకే నూరు మార్కులు వేస్తానని, అదే అమరావతికి మాత్రం సున్నా మార్కులే వస్తాయని కూడా చెప్పేస్తున్నారు.
హైటెక్ సిటీ విశాఖలో కట్టాలి కానీ తుళ్ళూరులో కట్టగలమా అంటూ బొత్స ప్రశ్నిస్తున్నారు. అమరావతికి ఎంత చేసినా విశాఖ అవుతుందా అని కూడా గట్టిగానే అడుగుతున్నారు.
విశాఖ టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా ఉంది. రాజధానిగా చేస్తే హైదరాబాద్ నే తలదన్నేలా డెవలప్ అవుతుందని కూడా బొత్స అంటున్నారు. రాజధాని రాజసం మొత్తానికి విశాఖకే ఉందని అంటున్న బొత్స అమరావతిని మాత్రం ఒక్కలెక్కన తీసికట్టు చేసేశారు.