ఆ పోరాటాలలో అల్లర్లు జరుగుతాయా?

నిరసన అంటేనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రజలు ప్రయోగించే అస్త్రం.  ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెట్టదలచుకున్నారు… అనే మోతాదుని బట్టి నిరసనలు- ప్రకటనలుగా ప్రదర్శనలుగా రాస్తారోకోలుగా ధర్నాలుగా సమ్మెలుగా బందులుగా రూపుమార్చుకుంటూ ఉంటాయి. …

నిరసన అంటేనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రజలు ప్రయోగించే అస్త్రం.  ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెట్టదలచుకున్నారు… అనే మోతాదుని బట్టి నిరసనలు- ప్రకటనలుగా ప్రదర్శనలుగా రాస్తారోకోలుగా ధర్నాలుగా సమ్మెలుగా బందులుగా రూపుమార్చుకుంటూ ఉంటాయి. 

ప్రస్తుతం అమరావతి ప్రాంత రైతులు జగన్ ప్రభుత్వం మీద కూడా అదే రకంగా ఒత్తిడి పెట్టదలచుకుంటున్నారు. అయితే నిరసనలు అల్లర్ల రూపంలో ఉండడం వలన ప్రభుత్వం మీద ఎక్కువ ఒత్తిడి వస్తుందనే భ్రమ కొందరిలో ఉండడం విచారకరం. ప్రస్తుతం అమరావతి ప్రాంత నిరసనల్లో కూడా అల్లర్ల బెడద పొంచి ఉన్నదని బెజవాడ లో వినిపిస్తోంది.

సంక్రాంతి పర్వదినం పండుగరోజులలో విజయవాడ అమరావతి ప్రాంతాలలో అల్లర్లు జరగవచ్చునని పుకార్లు వినిపిస్తున్నాయి.

తుని తరహా అల్లర్లు ప్లాన్ చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కుట్ర జరుగుతున్నట్లు వినిపిస్తోంది. నిజానికి ప్రభుత్వం వాటిన నిర్దాక్షిణ్యంగా అణచివేస్తుంది. వారు ఆశించే ప్రయోజనం నెరవేరదు. పైగా ఉద్యమం అభాసుపాలు అవుతుంది. ఈ విషయాలు ఎవరికీ తెలియని సంగతులు కాదు. 

అయితే,  పరిణామాలు ఎలా ఉండగలవో తెలిసినప్పటికీ అమరావతి ప్రాంత రైతు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారు అల్లర్లకు పాల్పడతారా అనేది సందేహం. లేదా, వారి ముసుగులో జగన్మోహన రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుచేయడానికి  కుట్రలు పన్నుతున్న రాజకీయ శక్తులు తెర వెనుక నుంచి ఈ అల్లర్లను నడిపిస్తాయా అనే అనుమానం  కూడా పలువురిలో కలుగుతోంది.

ఏది ఏమైనప్పటికీ పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వుండవలసిన ఆవశ్యకత ఉంది.  రాబోయే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సమాజ వాతావరణం కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. ఎవరు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడదలచుకున్నా వీలైనంత ముందుగా పసిగట్టి.. వారి ఆటకట్టించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.